365 రోజుల పాటు థియేటర్ లో ఆడని ఓ సినిమాని ఆడినట్లుగా అభిమానులు, అభిమాన సంఘాలు ప్రచారం చెయ్యడమే కాకుండా.. ఆ చిత్రానికి గోల్డెన్ జూబ్లీ వేడుకలు చెయ్యబోతున్నట్టుగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది అంటూ కొంతమంది నెటిజెన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. మూసేసిన థియేటర్ లో ఒక సినిమా ఏడాది ఆడినట్టుగా పోస్టర్ వేసి, అభిమాన సంఘాల అధ్యక్షులు దానికి ఫంక్షన్స్ నిర్వహించి వేడుక చేస్తామంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు.
రీసెంట్ గా మెగా హీరో నటించిన సినిమాని కూడా ధియేటర్ లో ఎప్పుడో ఎత్తేసిన తర్వాత కూడా 50 వారాల పాటు ఆడినట్లుగా ప్రకటనలు చేస్తూ, దానికి గవర్నమెంట్ కేటాయించిన సర్వీస్ ఓరియెంటెడ్ స్థలాన్ని వాడుతూ.. పోస్టర్స్, ఫ్లెక్సీల లో తమ ఫోటోలు వేసుకొని వైరల్ చెయ్యడం జరుగుతున్నది. ఇదంతా కావాలనే అభిమాన సంఘాల అధ్యక్షులు చేస్తున్నారంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
అసలు ఒక సినిమా ఒక థియేటర్ లో ఏడాది పాటు ఆడితే ఎంత కలెక్షన్స్ రావాలి, ఆ వచ్చిన దానికి ఎంటర్టైన్మెంట్ టాక్స్ ఎంత జీఎస్టీ రూపంలో చెల్లించారు అనేది లెక్కలు చూపాలి కానీ అలా చేయటం లేదు. ఒక్క రూపాయి కూడా కట్టలేదు. ఎందుకంటే మూసేసిన థియేటర్ లో సినిమా ఆడదు కాబట్టి. మరి ఇదంతా చేసి హీరోలను అభాసు పాలు చెయ్యడానికే అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోన్న మాట.
రీసెంట్ గా మెగా అభిమానులు వాల్తేర్ వీరయ్య సినిమా అవనిగడ్డ లోని ఓ థియేటర్ లో 365 రోజులు పూర్తి చేసుకోబోతుందని, ఈ ఏడాది సంక్రాంతి స్పెషల్ గా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య మూవీ వచ్చే సంక్రాంతి కి ఏడాది పూర్తవుతుందని, 365 రోజులు దిగ్విజయంగా ప్రదర్శిస్తున్నామంటూ.. వాల్తేరు వీరయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలు అవనిగడ్డ లో మెగాభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షులు పూనుకున్నారు.
అలాగే మరొక హీరో అభిమానులు కూడా ఇదే తరహగా వారి సినిమాను కూడా రాయలసీమ లో ఆడినట్లు ప్రచారం మొదలు పెట్టబోతున్నారని సమాచారం. ఈ విషయంలో నిర్మాతలు తమ ఉనికిని కోల్పోయి అభిమానులకు వంతపాడుతున్నట్లుగా తెలుస్తున్నది. ఇది అత్యంత విచారకరం. ఇప్పుడు సినిమాలు ఓటిటి లలో వారాలలోనే వచ్చేస్తున్న ఈ రోజులలో.. ఇంకా 100 రోజులు, 1 ఇయర్ సినిమాలు ఆడుతున్నాయా..? అంటూ నెట్ పోస్ట్ లను చూచి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.. అభిమానులు తమ హీరోల పరువును నిలువునా నవ్వుల పాలు చేస్తున్నారంటూ చిరాకుపడుతున్నారు.