ఏ ముహూర్తాన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ నినాదాన్ని అందుకుున్నారో కానీ ఆ క్షణమే దేవతలు తథాస్తు అన్నట్టున్నారు. అందుకేనేమో మరో ఛాన్స్ అడిగే అవకాశమే లేకుండా చేశాడు. అసలే ప్రతిపక్ష పార్టీలు స్ట్రాంగ్ అయిపోయాయి. అది చాలదన్నట్టు ఏరి కోరి నియమించుకున్న వలంటీర్ వ్యవస్థ పాములా మారి మింగేసేందుకు సిద్ధంగా ఉంది. ఇటు చూస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఏకు మేకై కూర్చున్నారు. మంత్రులు చూస్తే మాట వినే పరిస్థితి లేదు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ పార్టీ ఇజ్జత్‌ను నడిరోడ్డుపై పెట్టేశారు. ఇన్ని చేస్తున్న దేవుడు పగబట్టినట్టుగా తనను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడిన చెల్లినే.. అధికారం రాకుండా చేసేందుకు రంగంలోకి దింపబోతున్నాడు.
ఆ ఇద్దరే గద్దె దింపేయబోతున్నారు..
డెస్టినీ అంటే ఇదేనేమో.. మొత్తానికి ఇవన్నీ చూస్తుంటే సీఎం జగన్‌కు గట్టిగా టైమ్ ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తోంది. ప్రజలు, దేవుడినే నమ్ముకున్నానని పదే పదే చెప్పే జగన్‌ను ఆ ఇద్దరే గద్దె దింపేయబోతున్నారు. నాలుగున్నరేళ్లుగా సంక్షేమం తప్ప మరొకటి తెలియని జగన్‌ను ఇక చాలంటున్నారు. ఇది చాలదన్నట్టు రేపో మాపో జగన్ సోదరి వైఎస్ షర్మిల ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా అడుగు పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ ఢిల్లీకి వెళ్లారు. ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీకి దాదాపు టైం ఫిక్స్ అయినట్టుగానే తెలుస్తోంది.
షర్మిలపై కూడా ఆ విధంగానే విరుచుకు పడతారా?
ఆమె కాంగ్రెస్‌లో చేరి ఊరుకుంటే పర్వాలేదు కానీ ఖర్మ కాలి ఏపీ కాంగ్రెస్‌లో చేరారో జగన్‌కు సినిమానే అని టాక్ నడుస్తోంది. ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జి మానిక్కం ఠాకూర్‌తో సహా కాంగ్రెస్ ముఖ్యనేతలను కూడా డిల్లీకి పిలవడం.. షర్మిల కూడా భర్తతో కలిసి ఢిల్లీకి వెళ్లడం హాట్ టాపిక్‌గా మారాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్‌లో చేరడమో లేదంటే రాష్ట్ర పగ్గాలు పూర్తిగా ఆమెకే అప్పగించడమో జరుగబోతోందని స్పష్టమవుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ ముగిసిన తర్వాత కానీ ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఇప్పటి వరకూ విపక్షాలపై విరుచుకుపడిన వైసీపీ బూతుల నేతలు ఇప్పుడు షర్మిలపై కూడా ఆ విధంగానే విరుచుకు పడతారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.