ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా అఖిల ప్రియను ఎదుర్కోవడం వైసీపీకి చాలా కష్టంగా మారింది. గత ఎన్నికలలో ఆళ్లగడ్డ నుంచి వైసీపీనే విజయం సాధించింది. అక్కడ నుంచి వైసీపీ తరుఫున బ్రిజేందర్ రెడ్డి (నాని) ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అధికారంలో ఉన్నా కూడా భూమా అఖిలప్రియ ఫ్యామిలీని అడ్డుకుని నిలవడం కష్టంగా మారిందని టాక్. ఈ నేపథ్యంలోనే వైసీపీ స్కెచ్ మార్చేసింది. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టింది. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనబెడుతోంది. అలాగే కొందరు ఎమ్మెల్యేల స్థానాలను మారుస్తోందన్న విషయమూ తెలిసిందే.
మహిళ నేతను తెరపైకి తెచ్చిన వైసీపీ..
తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనూ అభ్యర్థిని మార్చనున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఓ మహిళా నేతను వైసీపీ తెరపైకి తెచ్చింది. ఆమె మరెవరో కాదు.. ఎమ్మెల్యే నాని సొంత అక్క గంగుల అవంతి రెడ్డి. గత కొంతకాలంగా అవంతి రెడ్డి రాజకీయాల్లో చాలా యాక్టివ్ అయ్యారు. ఆళ్లగడ్డలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అవంతి అనే చర్చ సర్వత్రా సాగుతోంది. అంతేకాకుండా సర్వేలు సైతం నానికి వ్యతిరేకంగా ఉండటంతో అభ్యర్థిని మార్చాలని వైసీపీ ఫిక్స్ అయ్యిందట. ప్రస్తుతం టీడీపీ ఇన్‌చార్జిగా భూమా అఖిల ప్రియ ఉన్నారు. ఆమెను ఎదుర్కోవాలంటే మరో మహిళ అయితేనే సాధ్యమవుతుందని జగన్ భావిస్తున్నారట.
ఏదైనా హామీ లభించిందా?
నిజానికి అఖిలప్రియపై కూడా కొన్ని అవినీతి ఆరోపణలున్నాయి. అయినా సరే.. ఆమెకు ఎదురెళ్లి నిలవడమంటే కష్టమేనని వైసీపీ భావిస్తోందట. దీంతో నానికి బదులుగా మరొకరిని రంగంలోకి దింపాలని వైసీపీ భావించింది. ఈ క్రమంలోనే నాని సొంత అక్క అవంతి రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల ఆమెను ఎమ్మెల్యే నాని స్వయంగా సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఆమెకు జగన్ నుంచి ఏదైనా హామీ లభించిందో లేదో తెలియదు కానీ ఆమె మాత్రం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వైసీపీ తరుఫున ప్రచారం చేస్తున్నారు.