డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి, వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల గిఫ్ట్ పంపించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అసలు ఎన్నడూ లేనిది.. షర్మిల ఇప్పుడు నారా లోకేష్‌కు గిఫ్ట్ పంపడమేంటని అంతా విస్తుబోయారు. నారా లోకేష్ సైతం దీనిని చాలా పాజిటివ్‌గా స్వీకరించి ఆమె కుటుంబానికి నారా కుటుంబం తరుఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల.. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన ఆమె కనీసం వారెవరికీ గిఫ్ట్స్ పంపించింది లేదు కానీ తన అన్నకు శత్రువైన నారా లోకేష్‌కు గిఫ్ట్ పంపించడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
అన్నపై పగ సాధించేందుకు షర్మిల ఇలా చేశారా?
క్రిస్మస్ సందర్భంగా బహుమతులు పంపడం సర్వసాధారణమే అయినా కూడా నారా లోకేష్‌కు పంపించడమేంటి? నారా లోకేషేమో బహుమతులు బాగున్నాయంటూ ట్వీట్ చేయడమేంటి? ఇది కొత్త చర్చకు దారి తీసింది. ఈ దోస్తీ వెనక మతలబు ఏంటా అని సోషల్ మీడియాలో సైతం చర్చలు ఊపందుకున్నాయి. జగన్‌కు, షర్మిలకు పడడం లేదన్న విషయం తెలిసిందే. అన్నపై పగ సాధించేందుకు షర్మిల ఇలా చేశారా? అనుకుందామన్న ఆమె ఏనాడూ అన్నకు వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. అన్నకు దూరంగా ఎందుకు వచ్చేయాల్సి వచ్చిందో కూడా ఎక్కడా మాట్లాడలేదు. మరి ఇప్పుడు ఎందుకిలా? అంటే ఇప్పుడు అన్న మీద పై చేయి సాధించేందుకు యత్నిస్తున్నారేమోనని కొందరు అంటున్నారు.
ప్రియా అట్లూరిని రాజారెడ్డి ప్రేమించాడట..
మరికొందరు మాత్రం ఇదంతా షర్మిల కొడుకు పెళ్లి కోసమేనంటున్నారు. షర్మిల కొడుకు రాజారెడ్డికి త్వరలోనే పెళ్లి జరగబోతోందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రియా అట్లూరిని రాజారెడ్డి ప్రేమించాడని టాక్. ప్రియకు విజయమ్మ చీర పెడుతున్న ఫోటో బయటకు రావడంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని.. త్వరలోనే పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రియా వచ్చేసి చంద్రబాబు దూరపు చుట్టమని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె నారా ఫ్యామిలీతో షర్మిల సన్నిహితంగా ఉంటున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో కానీ లోకేష్‌కు షర్మిల గిఫ్ట్ పంపడం మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.