కట్టప్ప బాహుబలిని ఎలా చంపాడు? అన్న ప్రశ్న మాదిరిగా ఏపీలో ఒక ఇష్యూ హాట్ టాపిక్‌గా నడుస్తోంది. అసలు టీడీపీకి.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కి లింకెలా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించారు. అలాంటిది ఇప్పుడు టీడీపీకి వ్యూహాలందించేందుకు సిద్ధమవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఉన్నట్టుండి పీకే గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమవడం ఒకింత ఆశ్చర్యంగా అనిపిస్తే.. ఆయనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రిసీవ్ చేసుకోవడం ప్రతి ఒక్కరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. లోకేష్ కారులో ప్రశాంత్ కిషోర్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లడం షాకింగ్‌గా మారింది
దోస్తీ కుదిర్చిన వ్యక్తి ఎవరు?
అప్పటి నుంచి మీడియా హడావుడి మొదలైంది. అసలేం జరుగుతోందంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇక చంద్రబాబు, పీకే, భేటీ దాదాపు 3గంటల పాటు నడిచింది. ఈ భేటీలో టీడీపీ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ సైతం పాల్గొన్నారు. ఈ భేటీ తరువాత ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోసం పని చేయాలని నిర్ణయించుకున్నారంటూ మీడియా అయితే కోడై కూస్తోంది. అసలు టీడీపీకి, ప్రశాంత్ కిషోర్‌కు మధ్య దోస్తీ కుదిర్చిన వ్యక్తి ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. దీనికి అయితే ఓ కథనం ప్రచారంలో ఉంది. నిన్న మొన్నటి వరకూ వైసీపీ పప్పు అంటూ నారా లోకేష్‌ను ఇష్టానుసారంగా అవహేళన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే లోకేష్.. ప్రశాంత్ కిషోర్‌తో మాట్లాడి టీడీపీతో కలిసి పనిచేసేందుకు ఒప్పించారట.
వైసీపీ టీం పీకేపై విమర్శలు..
వైసీపీకి పీకేతో ఉన్న గ్యాప్‌ను గమనించిన లోకేష్ ఢిల్లీ వెళ్లిన సమయంలో స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా నిర్వహించారట. తండ్రి కోసం న్యాయ నిపుణులతో మాట్లాడటమే కాకుండా పీకేను కూడా కలిశారట. అంతేకాదు.. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలంటూ సూచనలు చేసింది కూడా పీకేనని టాక్. తొలుత ఆయనతో నారా లోకేష్ సుదీర్ఘ భేటీలు అయితే నిర్వహించారట. ఆపై చంద్రబాబుతో భేటీకి ఒప్పించారట. ఒకప్పుడు రాబిన్ శర్మ కూడా తన శిష్యుడే కావడంతో ఇప్పుడు తిరిగి ఆయనను పీకే లీడ్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఆ వెంటనే వైసీపీ టీం పీకేపై విమర్శలకు పూనుకుంది. ఆ వెంటనే పీకే వ్యూహాలు కూడా ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి ప్రతి వ్యూహాలకు సిద్ధమవుతోందని సమాచారం.