మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో స్వేద పత్రం విడుదల చేశారు. శనివారమే స్వేదపత్రం విడుదల చేస్తామన్న కేటీఆర్ ఒకరోజు ఆలస్యంగా దీనిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో సృష్టించిన సంపదపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనను బద్నాం చేసే క్రమంలోనే తప్పుల తడక, అబద్ధాల పుట్టతో కూడిన శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. శ్వేతపత్రాన్ని అంకెల గారడీగా.. అభాండాల చిట్టాగా ఆయన అభివర్ణించారు.
విరిగిన లాఠీలకు.. పేలిన బుల్లెట్లకు లెక్కలేదు..
బాధ్యత గల పార్టీగా ఈ స్వేదపత్రాన్ని విడుదల చేస్తున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. కొత్త రాష్ట్రంగా ఏర్పాటైన అనంతరం విధ్వంసం నుంచి వికాసం దిశగా సంక్షోభం నుంచి సమృద్ధి వైపు తెలంగాణ అడుగులు వేసిందన్నారు. ఎన్నో పోరాటాల తర్వాత ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఇప్పుడు కొందరు నేతలు తమ వల్లే సాధ్యమైందంటున్నారని కేటీఆర్ తెలిపారు. ఉద్యమంలో నాడు విరిగిన లాఠీలకు.. పేలిన బుల్లెట్లకు లెక్కలేదని తెలిపారు. అలాంటి తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించే యత్నం జరుగుతోందని కేటీఆర్ వివరించారు. రాష్ట్ర స్థూల రుణం రూ.3.17 లక్షల కోట్లు కాగా.. దీన్ని కాంగ్రెస్ నేతలు రూ.6.70 లక్షల కోట్లుగా చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
తిమ్మిని బమ్మిని చేస్తున్నారు..
ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలతో పాటు ఇవ్వని వాటిని కూడా అప్పులుగా చూపుతున్నారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో మొత్తం రుణాలు రూ.3,17,051 కోట్లు మాత్రమేనని.. దీనికి లేని అప్పును జత చేసి తిమ్మిని బమ్మిని చేశారన్నారు. ఆర్టీసీ, విద్యుత్, పౌరసరఫరాల్లో అప్పు లేదన్నారు. పౌరసరఫరాల సంస్థకు రూ.21,029 కోట్లు మాత్రమే ఉందని.. నిల్వలతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బును అప్పులుగా చూపారన్నారు. తెలంగాణలో గత పదేళ్ల ఖర్చు రూ.13,72,930 కోట్లు అని కేటీఆర్ తెలిపారు. విద్యుత్ రంగంలో తాము సృష్టించిన ఆస్తులు రూ.6,87,585 కోట్లు అని.. విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 19,464 మెగావాట్లకు పెంచామని వెల్లడించారు.
ప్రపంచమంతా నిందించే దుస్థితికి తీసుకురావొద్దు..
కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఉన్న చిన్న తప్పును చూపించి ప్రాజెక్టునే తప్పుబడుతున్నారన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో తప్పు జరిగితే సరిచేయాలన్నారు. కాళేశ్వరంపై విచారణను స్వాగతిస్తున్నామని.. తప్పు జరిగితే చర్య తీసుకోవాలని కేటీఆర్ తెలిపారు. తమపై కోపంతో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చి ప్రపంచమంతా మనల్ని నిందించే దుస్థితి తీసుకురావొద్దన్నారు. పాలమూరు - రంగారెడ్డి పనులు ఇప్పటికే 90శాతం పూర్తయ్యాయని మిగిలిన 10 శాతం కూడా పూర్తి చేసి నీళ్లివ్వాలన్నారు. ఇక 1,11,320 కుటుంబాలకు రైతు బీమా సొమ్ము అందిందన్నారు. 1,11,320 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సీఎం అంటున్నామని.. రైతుబీమా వచ్చిన వాటిలో 99.9శాతం సహజమరణాలేనని కేటీఆర్ వెల్లడించారు.