మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ పార్టీలకు బాగా కలిసొస్తోంది. కర్ణాటకలో వర్కవుట్ అవడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ హామీ ఇచ్చింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది. కేవలం కాంగ్రెస్ సక్సెస్ మంత్ర ఈ ఒక్క హామీ అనే చెప్పలేము కానీ ఇది కూడా ఒక కారణమే. అయితే ఈ సక్సెస్ మంత్రాను ఏపీలో టీడీపీ పట్టుకుంది. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి గెలిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తమ మినీ మేనిఫెస్టోలో ప్రకటించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర సక్సెస్ సందర్భంగా ఈ నెల 20న విజయనగరంలో ‘యువగళం-నవశకం’ పేరిట టీడీపీ బహిరంగ సభ నిర్వహించింది.
ఒక్క దెబ్బకు రెండు ప్రయోజనాలు..
ఈ సభలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. హమ్మా.. టీడీపీ దెబ్బేసిందిరా బాబోయ్ అనుకున్న వైసీపీ అధిష్టానం.. ఇప్పుడు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే అంశాన్ని చేర్చలేదు కాబట్టి ఏం చేయాలో బాగా ఆలోచించి అదిరిపోయే స్కెచ్ వేసింది. దీనిలో భాగంగా సంక్రాంతి పండుగ నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ అవకాశం కల్పిస్తే టీడీపీని దెబ్బ కొట్టినట్టు ఉంటుంది. ఎన్నికల్లో ఓట్లు రాలడానికి ఇది అవకాశమూ కల్పిస్తుంది. ఒక్కదెబ్బకు రెండు ప్రయోజనాలు. కాబట్టి సీఎం జగన్ ఆ దిశగా ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే దీనిపై రాష్ట్ర రవాణాశాఖ, ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో కూడిన ఓ బృందం అధ్యయనం స్టార్ట్ చేసేసిందట.
సంక్రాంతి పండుగ నుంచే ప్రారంభం?
ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ఈ పథకం అమలుతో పాటు లాభనష్టాలు, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి ఓ నివేదికను తయారు చేసి వారం రోజుల్లో సీఎం జగన్‌కు నివేదిక అందించనున్నారట. అంతా ఓకే అనుకుంటే ఈ సంక్రాంతి పండుగ నుంచే ఈ పథకాన్ని ప్రారంభించవచ్చని తెలుస్తోంది. మొత్తానికి పథకాన్ని కొట్టేయలేరు కాబట్టి స్కెచ్ వేసి టీడీపీని దెబ్బ కొట్టేందుకు యత్నిస్తున్నారు జగన్. ఈ స్కెచ్ చేస్తున్నారు కాబట్టే.. చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణం హామీ ప్రకటించిన తర్వాత ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత కూడా దీనిపై స్పందించలేదు. కనీసం ఎలాంటి విమర్శలూ చేయలేదు. చంద్రబాబు నోటి వెంట మాట రాగానే మీడియా ముందు క్యూకట్టే వైసీపీ నేతలు కిమ్మనకుండా ఉండిపోయారంటే పక్కాగా జగన్ స్కెచ్ సిద్ధం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.