అధికారంలో ఉంటే చాలు ఎక్కడ లేని ధీమా వచ్చేస్తుంది. ఏమైనా చేసేయవచ్చన్న తలంపు. అధికారం మారితే పరిస్థితేంటన్న ఆలోచనే ఉండదు. ప్రస్తుతం తెలంగాణలో అదే జరిగింది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా కదులుతున్నాయి గత ప్రభుత్వ బాగోతాలు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు రానున్నది గడ్డు కాలమేనని పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. తెలంగాణ గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా సాగునీటి వనరులు, విద్యుత్, పర్యాటక, పౌరసరఫరా శాఖలలో భారీగా అప్పులు, అవినీతి జరిగిన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరుగుతోందని జనంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గులాబీ బాస్.. అదే నీళ్లు, నిధుల్లో చాలా గోల్‌మాల్ చేశారట.
అప్పులు, అవినీతిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్..
ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్, రైతుబంధులు అవినీతికి అడ్డాగా నిలిచాయట. వీటిని అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా అందిన కాడికి దోచుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మొట్టమొదటి మేడిగడ్డ బ్యారేజ్‌లోని 7వ బ్లాక్‌లో కొంత భాగం కుంగిపోవడంతో సీఎం రేవంత్ ఫోకస్ ప్రాజెక్టులపై పడింది. మేడిగడ్డ సహా కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని బ్యారేజిలకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేటి అసెంబ్లీలో సైతం కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులు, పలు సంస్థల నష్టాలు, దుబారా ఖర్చు, అవినీతిపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తామని చెప్పారు.
ఒక్కొక్కరి రాజకీయ భవిష్యత్ అస్సామే..
కేసీఆర్‌ను పూర్తిగా కార్నర్ చేసేందుకు నిరంజన్ రెడ్డితో మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్ నేత నిరంజన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయించారు. భూ బదలాయింపులు ఏ విధంగా జరిగాయో తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌ను వాడుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దీంతో భూబదలాయింపుల బాగోతమంతా బయటకు రానుంది. బీఆర్ఎస్ నేతల తప్పు ఉన్నట్టో తేలిందో ఒక్కొక్కరి రాజకీయ భవిష్యత్ అస్సామే. ఏదో గుడ్డిగా వెళ్లిపోవాలని రేవంత్ సైతం భావించడం లేదని ప్రస్తుతం జరుగుతున్న తంతును చూస్తే అర్థమవుతుంది. పక్కా ఆధారాలతోనే ఎవరినైనా కార్నర్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి రేవంత్ అయితే ఉచ్చు బిగుస్తున్నారు. మరి బీఆర్ఎస్ నేతలు క్లీన్ చిట్‌తో బయటపడతారో లేదంటే అడ్డంగా బుక్ అవుతారో చూడాలి.