ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని.. తెలంగాణ ఎన్నికలు వైసీపీ నాశనానికి వచ్చినట్టుంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ బాస్‌లో కలవరం మొదలైనట్టుంది. మీనమేషాలు లెక్కిస్తే సీటు చిరిగిపోద్దనే భయం పట్టుకున్నట్టుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగ్‌లనే తిరిగి సీటులో కూర్చోబెట్టాలనుకుంటే పరిస్థితి ఏమైందో చూశాక కూడా అదే బాటలో నడిస్తే అసలుకే ఎసరొస్తుందని భావించి గ్రేడింగ్ చేయడం మొదలుపెట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి. తడిచెత్త, పొడిచెత్తను వేరు చేసినట్టుగా సర్వేలు నిర్వహించి మరీ పనికొచ్చే ఎమ్మెల్యేలను ఒకవైపు.. ప్రజాబలం లేదనుకున్న ఎమ్మెల్యేలను మరోవైపు పడేశారు. ఆ వెంటనే ప్రజాబలం లేని ఎమ్మెల్యేల స్థానంలోకి మరొకరిని తీసుకున్నారు. కొందరిని స్థాన మార్పిడి చేస్తున్నారు. అంతే.. కూర్చొన్న సీటును లాగేస్తామంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. వారంతా ఏకమై మరీ తాట తీస్తామంటున్నారు.
వణికిపోతున్న తాడేపల్లి ప్యాలెస్..
మార్చకుంటే ఓడిపోతారేమోనన్న భయం.. మారిస్తే రివర్స్ అయిపోయి అంతా ఏకమై చివరకు వైసీపీని సమాధి చేస్తారేమోనన్న భయంతో తాడేపల్లి ప్యాలెస్ వణికిపోతోంది. ఒకప్పుడు ఎమ్మెల్యేలకు తాడేపల్లి పాలెస్ వైపునకు చూసే ధైర్యం కూడా ఉండేది కాదు. ఇప్పుడు నేరుగా కోట గేట్లు బద్దలు కొట్టుకుని మరీ లోపలికి ఎమ్మెల్యేల కార్లు వెళ్లిపోతున్నాయి. ఆపే సాహసం కూడా ఎవరూ చేయడం లేదు. 150 మంది ఎమ్మెల్యేల్లో సుమారు 80 మందికి ఈసారి మొండిచేయి చూపిస్తారని టాక్. కొంత మంది ఎమ్మెల్యేలకు లోక్‌సభ టికెట్లు, ఎంపీలకు ఎమ్మెల్యే స్థానాలకు మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ నియోజకవర్గాల ఇన్‌చార్జుల మార్పిడి చూసినా ఈ విషయం స్పష్టమవుతుంది. దీంతో అసంతృప్తి ఒక్కసారిగా తాడేపల్లి ప్యాలెస్‌ను తాకింది. పరిస్థితి చేయి దాటే అవకాశం కనిపించడంతో ఏకంగా జగనే రంగంలోకి దిగాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలతో జగన్ భేటీ అయ్యారు.
శాంతి వచనాలు వల్లిస్తున్నారట..
తొలుత అసంతృప్త ఎమ్మెల్యేలతో అన్ని శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి భేటీ అవుతున్నారు. కానీ వీరి మాట అయితే పెద్దగా వినే పరిస్థితి అయితే లేదని తెలుస్తోంది. దీంతో జగన్‌తో భేటీకి పంపిస్తున్నారట. అది కూడా షరతులతో కూడిన భేటీ అండోయ్.. అలాగే ఇక్కడ కూడా గ్రేడింగే. ఒక ఎమ్మెల్యేకు అంగబలం, అర్థబలం ఉంటే జగన్ వరకూ.. అవి లేవంటే సజ్జలే సూటిగా సుత్తి లేకుండా బెదిరించి దారికి తెచ్చే యత్నం చేస్తు్న్నారట. మాజీ మంత్రి వెల్లంపల్లి, మల్లాది విష్ణులకు సైతం ఈ సారి టికెట్ దక్కే అవకాశం లేదట. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. లిస్ట్ చెప్పుకుంటూ పోతే ఈ సారి టికెట్ దక్కని నేతల లిస్ట్ చాంతాండంత. వీరందరినీ బుజ్జగించే పనిలో సజ్జల ఉన్నారట. మొత్తానికి ఓటమి భయం పట్టుకున్న జగన్ ఇప్పుడు నియంతృత్వ ధోరణి వదిలి శాంతి వచనాలు వల్లిస్తున్నారట. జగన్ నిర్ణయంతో సంబంధం లేదని బరిలోకి దిగుతామని కొందరు.. సోదిలో కూడా కనిపించకుండా మరికొందరు వెళ్లిపోయారట. మొత్తానికి ఏపీ వైసీపీలో తెలంగాణ ఎన్నికలు పెను తుఫాన్‌నే సృష్టించాయి.