చిన్న బ్రేక్ ఇస్తున్నా.. చిటికెలో వస్తా.. అనే మాట బిగ్ బాస్ ఫాలో అయ్యేవారికి కొత్తేం కాదు. కానీ ఇది బిగ్ బాస్‌కి సంబంధించిన మ్యాటర్ కాదు. అతి తక్కువ సినిమాలతో అంతులేని స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మ్యాటర్. ఆయనే ట్విట్టర్ వేదికగా ఈ డైలాగ్ చెప్పాడు. ఇంతకీ విషయం ఏమిటని అనుకుంటున్నారా?.. రీసెంట్‌గా ఆయన దర్శకత్వంలో వచ్చిన లియో సినిమా అనుకున్నంత గొప్ప సక్సెస్ చిత్రంగా నిలబడలేకపోయింది. దీంతో తన తదుపరి సినిమాపై పూర్తిగా ఏకాగ్రత పెట్టాలని లోకేష్ డిసైడ్ అయ్యాడు. అందుకే సోషల్ మీడియా అకౌంట్స్‌కు, చివరికి ఫోన్ కూడా కొన్నాళ్ల పాటు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నాడు. పూర్తిగా కాదండోయ్.. జస్ట్ స్మాల్ బ్రేక్ అంతే..
ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా విడుదల చేసిన లేఖలో ఏముందంటే.. నా మొట్టమొదటి ప్రయత్నంగా జీ స్క్వాడ్ బ్యానర్‌పై నా సమర్పణలో వచ్చిన ఫైట్ క్లబ్ సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. నా తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టడం కోసమని అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. చివరికి సెల్ ఫోన్‌కు కూడా అందుబాటులో ఉండకూడదనేలా నిర్ణయం తీసుకున్నాను. ఈ టైమ్‌లో నేను మీకు అందుబాటులో ఉండను. ఈ సందర్భంగా.. నా మొదటి ప్రాజెక్ట్ నుండి నాపై ప్రేమ, అభిమానం చూపిస్తున్న ప్రేక్షకులందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను మళ్లీ వచ్చే వరకు అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. నెగిటివిటీని దూరం పెట్టి పాజిటివ్‌గా ఉండాలని కోరుకుంటూ.. ప్రేమతో మీ లోకేష్ కనకరాజ్.. అని లోకేష్ రాసుకొచ్చాడు.
విజయ్‌తో లియో అనంతరం ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సినిమాను లోకేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. తలైవా171గా తెరకెక్కబోతోన్న ఈ సినిమాతో హిస్టరీ క్రియేట్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు లోకేష్. ఇందులో అన్ని సినిమా ఇండస్ట్రీల నుండి స్టార్ యాక్టర్స్ నటించనున్నారనేలా వార్తలు వినిపిస్తున్నాయి. రజినీతో లోకేష్ చేసే మ్యాజిక్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే.. ఇంకొన్ని నెలలు వెయిట్ చేయకతప్పదు. ఈ సినిమా తర్వాత ఖైదీ, విక్రమ్ సీక్వెల్స్ కూడా ఉంటాయని, అవి పూర్తయిన తర్వాత ప్రభాస్‌తోనూ ఓ సినిమా చేస్తానని లోకేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే.