రేవంత్ మరో కీలక నిర్ణయం.. ఇప్పటి వరకూ ఏ సీఎం తీసుకోలే..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చీరాగానే ప్రజాకర్షక పథకాలను వరుసబెట్టి ప్రవేశపెట్టారు. వచ్చీ రాగానే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టింది. వన్ బై వన్ చేసుకుంటూ వెళుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టగానే.. మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. అలాగే చేయూత, ఆరోగ్య శ్రీని రూ.10 లక్షలకు పెంచడం వంటివి అమలు చేశారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ప్రజావాణి నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన రావడంతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ నిర్వహించాలని భావిస్తున్నారు.
నోటిఫికేషన్ల విడుదలకు రంగం సిద్ధం..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పోతున్నారు. ఇప్పటికే స్త్రీలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, చేయూత, ఆరోగ్య శ్రీని రూ.10 లక్షలకు పెంచడం వంటివి అమలు చేశారు. ఇక మిగిలిన హామీల అమలుతో పాటు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే విద్యుత్ శాఖ.. టీఎస్‌పీస్సీ ప్రక్షాళన వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ల విడుదలకు సైతం రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే సెక్రటేరియట్‌లోకి సైతం అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
మార్గమేదైనా అన్వేషించండి..
సీఎం కాన్వాయ్ వెళుతోందంటే చాలు మినిమం 20 నిమిషాల పాటు పోలీసులు ఆ దారిలో ట్రాఫిక్‌ను నిలిపివేస్తారు. మనకు ఎంత అత్యవసర పని ఉన్నా కూడా మనం వెయిట్ చేయాల్సిందే. కానీ ఇక నుంచి ఆ అవసరం లేదు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. ఈ క్రమంలోనే సీఎం కాన్వాయ్ వెళ్లే టైమ్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై పోలీసు ఉన్నతాధికారులకు మార్గదర్శకాలు సైతం వెళ్లాయి. తన కాన్వాయ్ కోసమని జనాలను ఎక్కువ సేపు నిలిపివేయవద్దని.. దాని కోసం వేరే మార్గమేదైనా అన్వేషించాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఏ సీఎం కూడా ఇలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. రేవంత్ నిర్ణయంతో ముఖ్యంగా హైదరాబాద్ వాసులు ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు.