అవసరం తీరాక లాభనష్టాలు బేరీజు వేసుకుని పొత్తు పెట్టుకున్న పార్టీతో తెగదెంపులు చేసుకోవడమనేది రాజకీయాల్లో సర్వసాధారణం. కలిసొస్తుందనుకుంటే.. పాలు - నీళ్లలా కలిసిపోతారు. లేదంటే ఉప్పు నిప్పులా మారిపోతారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది ఇదే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. కానీ కలిసి రాలేదు. రెండు పార్టీలకు బీభత్సమైన దెబ్బ తగిలింది. అయితే బీజేపీ కీలక నేతలు అయితే ఓడారు కానీ గతంలో కంటే ఎక్కువ సీట్లను అయితే ఆ పార్టీ గెలుచుకుంది. ముఖ్యంగా దెబ్బ జనసేనకే. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దారుణ పరాజయం పాలైంది. కానీ బీజేపీ మాత్రం తమకేదో ఇబ్బంది తలెత్తిందని.. కాబట్టి ఇక మీదట తప్పు చేయకూడదని డిసైడ్ అయ్యింది.
పొత్తు చర్చలు జరిపింది బీజేపీనే..
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జనసేనతో పొత్తును కంటిన్యూ చేయకూడదని నిర్ణయించింది. ఈ విషయాన్ని స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. అయితే ఇది తెలంగాణ వరకేనని.. ఏపీలో కలవడమా.. విడిపోవడమా? అనేది అధిష్టానం నిర్ణయమని తేల్చి చెప్పారు. అసలు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని జనసేన వెల్లడించగానే.. పొత్తు చర్చలు జరిపింది బీజేపీ. 32 స్థానాల్లో పోటీ చేద్దామనుకుంది. వెంటనే రాయబారం నడిపిన కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌లు పొత్తుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఒప్పించారు. 32 స్థానాలనుకుంటే జనసేనకు 8 సీట్లతో సరిపెట్టారు. తిరిగి ఆ పార్టీ కారణంగానే తామేదో నష్టపోయామని రాళ్లే్స్తున్నదీ బీజేపీనే. మొత్తానికి జనసేనతో పొత్తుతో ఇమేజ్ డ్యామేజ్ అయిపోయిందని ఆవేదన చెందుతోంది.
బీజేపీ తెగదెంపులు చేసుకుంటుందా?
అయితే జనసేన పోటీ చేసిన 8 స్థానాల్లోనూ ఓటమి పాలైంది. బీజేపీ కోసం పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాతో కలిసి తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. జనసేనకు తెలంగాణలో బలం లేదని తెలుసుకోకపోవడం బీజేపీ తప్పు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరికొకరు సహకరించుకున్నదీ లేదు. ఏదిఏమైతేనేమి సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు లేదని కిషన్ రెడ్డి తేల్చేశారు. ఇప్పుడు తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ జనసేనతో బీజేపీ తెగదెంపులు చేసుకుంటుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. పొత్తుతో జనసేనకి దక్కేవే కొన్ని స్థానాలు. వాటిని బీజేపీతోపంచుకుంటుందా? లేదా? అనేది ప్రశ్నా్ర్థకంగా మారింది. ఇప్పటి వరకూ అయితే జనసేన ఏపీలో ఒక్కటంటే ఒక్క ఖాతానే తెరిచింది. గెలిచిన ఆ ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి జంప్. ఇలాంటి తరుణంలో లాభనష్టాలు బేరీజు వేసుకునే బీజేపీ.. జనసేనతో అంటకాగుతుందా? ఏమో చూడాలి.