అధికారంలో ఉంటేనే ఎవరికైనా గుర్తింపు. అది లేదంటే.. ఎంతటి నేత పరిస్థితైనా దారుణమే. అయినా వాళ్లే గుచ్చి గుచ్చి చంపేస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఇదే పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ షాకింగే. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపడుతున్నారు. వాటితో పాటే బీఆర్ఎస్ నేతలకు వెన్నులో వణుకు పుట్టించే పనులకు సైతం శ్రీకారం చుడుతున్నారు. తాజాగా భూ కబ్జాలపై ఫిర్యాదులను వెలికితీసే కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు కాస్త దారిలోకి వస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యేలకు పూర్తిగా భద్రత తొలగింపు..
కొందరు బీఆర్ఎస్ నేతలైతే సొంత పార్టీ వారిపైనే ఇష్టానుసారంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్‌కు భద్రత కుదించింది. ఆయనకు Y కేటగిరి భద్రతను ప్రభుత్వం కేటాయించింది. ఇక మాజీ మంత్రులకు 2+2 భద్రత... మాజీ ఎమ్మెల్యేలకైతే పూర్తిగా భద్రత తొలగించింది. వారికి కేటాయించిన గన్‌మెన్లను సైతం వెనక్కి పిలిపించేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు.. తమ పార్టీకి చెందిన మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌పై దారుణ విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదం, ఉద్యమం తెలియని వారికి మంత్రి పదవి ఇచ్చిందన్నారు. పైగా వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అవసరం లేదని... కుక్కలు కూడా వారి వెంట పడవంటూ తక్కలపల్లి రవీందర్ హాట్ కామెంట్స్ చేశారు.
సభ్యులు తక్కువ అయితే మద్దతు ఇస్తావా?
ఇక మల్లారెడ్డి వచ్చేసి భూకబ్జా దెబ్బకు కాస్త దిగి వచ్చారు. కాంగ్రెస్‌కు ఏదైనా అవసరమొస్తే అండగా నిలుస్తానని వ్యాఖ్యానించి షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకూ సీఎం రేవంత్‌పై కాలు దువ్విన మల్లారెడ్డి ఇప్పుడు పవర్ పోగానే మారిపోయి మాట మార్చేశారు. ఇవాళ అసెంబ్లీ నుంచి బయటికి వస్తుండగా మల్లారెడ్డికి తీన్మార్ మల్లన్న ఎదురుపడ్డారు. ఇక వీరిద్దరి మధ్య సంభాషణ వేరే లెవల్. తీన్మార్ మల్లన్న మేడ్చల్‌లో పోటీ చేస్తే ఎవరో ఒక మల్లన్నే అసెంబ్లీలోకి వచ్చేవారంటూ ఇద్దరూ జోక్స్ వేసుకున్నారు. ఆపై కాంగ్రెస్‌కు శాసనసభలో ఎప్పుడైనా సభ్యులు తక్కువ అయితే మద్దతు ఇస్తావా? అని మల్లారెడ్డిని తీన్మార్ మల్లన్న సరదాగా ప్రశ్నించారు. దీనికి మల్లారెడ్డి కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని తెలిపారు. ఎన్నికల అప్పుడే రాజకీయాలని.. తర్వాత అందరం ఒక్కటేనని తెలిపారు. మొత్తానికి ఏ బోధి వృక్షం కింద కూర్చొని వచ్చారో కానీ మల్లారెడ్డికి బాగానే జ్ఞానోదయమైందని నెట్టింట సరదాగా చెప్పుకుంటున్నారు.