ఏపీలో వైసీపీ - బీజేపీల మధ్య స్నేహం కాస్త వైరంగా మారనుందని ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు బీజేపీ అగ్ర నేతలు ఆయనకు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. ఎన్ని కోట్ల అప్పులైనా ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేసింది కేంద్రం. అలాగే కేసుల బారి నుంచి కాపాడుకుంటూ వచ్చింది. దీనికి కారణం వైసీపీకి ఎంపీల బలం కాస్త గట్టిగానే ఉండటమని తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఏపీలో పరిస్థితులు మారాయి. తెలంగాణలో అత్యంత బలవంతుడైన కేసీఆర్‌కే ఇంటి దారి పట్టక తప్పలేదు. ఇక జగనెంత అంటూ సర్వత్రా టాక్ నడుస్తోంది. ఏపీలో విద్యావంతుల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.
ఒక్క సీటైనా గెలుచుకునే సత్తా ఉందా?
ఈసారి ఏపీలో బీజేపీ రావడం కష్టమేనని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఈ తరుణంలో ఇంకా వైసీపీకి సపోర్టు చేస్తూ పోస్తే అసలుకే ఎసరొస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారట. పోనీ ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటైనా గెలుచుకునే సత్తా ఆ పార్టీకి ఉందా? అంటే అదీ లేదు. కాబట్టి మున్ముందు టీడీపీ, జనసేన కూటమిలో చేరవచ్చని సమాచారం. ఈ క్రమంలోనే ముందుగా వైసీపీతో ఉన్న బంధాన్ని తెంచేసుకోవాలి. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభమైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీతో మునుపటి సఖ్యతను పాటించకపోవడమే ఇలాంటి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. చంద్రబాబు అరెస్ట్‌కు ముందు మాటిమాటికీ ఢిల్లీకి వెళ్లే జగన్ ఇటీవలి కాలంలో పూర్తిగా తగ్గించేశారు.
ఈ విషయాలన్ని బీజేపీ అగ్ర నేతల దృష్టికి వెళ్లాయట..
రుణాల పేరు చెప్పి నెలకోసారి జగన్ హస్తినకు వెళ్లేవారు. కేంద్రం కూడా ఆయనకు ఇట్టే రుణాలు మంజూరు చేసేంది. కానీ చంద్రబాబు అరెస్ట్ తరువాత నుంచి జగన్ హస్తిన టూర్లు పెద్దగా పెట్టుకోలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ ఆ పార్టీ వైపు చూస్తున్నారట. యూరప్ పర్యటనలో జగన్‌ను కలిశారని.. ఆ తరువాత తన సోదరి షర్మిల విషయమై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ విషయాలన్ని బీజేపీ అగ్ర నేతల దృష్టికి వెళ్లాయట. దీంతో జగన్‌ను దూరం పెట్టాలని డిసైడ్ అయ్యారట. పైగా ఈసారి ఏపీలో వైసీపీ వచ్చే అవకాశం కూడా లేదని నివేదికలు అందడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందట. ఇదే నిజమైతే మాత్రం ఏపీలో వైసీపీకి దారుణ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.