పవన్ కళ్యాణ్ తో సినిమాలు ఎనౌన్స్ చేసి ఇప్పడు ఆయన డేట్స్ కోసం కిందా మీదా పడుతున్న దర్శకనిర్మాతలు చూస్తుంటే అయ్యో పాపం అనక మానరు. రాజకీయాల్లోకి వెళ్ళాక మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ రీమేక్ మూవీస్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇప్పుడు స్ట్రయిట్ మూవీస్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్, OG మూవీతో ఎప్పుడెప్పుడు ఫాన్స్ ని అలరిస్తారా అని ఎదురు చూస్తుంటే ఆ శుభ తరుణం ఇంకా ఇంకా వెనక్కి వెళుతూనే ఉంది.
రాజకీయాలు, సినిమాలు అంటూ రెండు పడవల మీది కాళ్ళేసి సముద్రాన్ని ఊదుతున్న పవన్ కళ్యాణ్ నిన్నమొన్నటివరకు రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. కాని ఇప్పుడు ఏపీ ఎన్నికలంటూ యుద్ధంలోకి దిగిపోయారు. ఎక్కువ శాతం రాజకీయాలకే సమయం కేటాయించడంతో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ OG మూవీస్ షూటింగ్స్ ఆగిపోయాయి. ఇక గత ఏడాదే హరి హర వీరమల్లుని పవన్ కళ్యాణ్ పక్కనబెట్టేశారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు అంతే.
రెండు నెలల క్రితం అంటే వారాహి యాత్ర మొదలు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన హడావిడికి ఆయన దర్శకనిర్మాతలు మంగళగిరి వెళ్ళారు. పవన్ కోసం అక్కడక్కడే షూటింగ్స్ కూడా ప్లాన్ చేసారు అన్నారు. కానీ కుదరలేదు. ఈమధ్యలో పవన్ వచ్చి కొద్దిరోజులు షూటింగ్ కి హాజరయ్యారు. ఇక ఇప్పుడు మాత్రం పవన్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆయనతో సినిమాలు చేసే దర్శకనిర్మాతలు మధనపడిపోతున్నారు.