గత ఎన్నికల్లో వైసీపీ పెద్ద ఎత్తున విజయం సాధించిందన్నా.. జగన్ సీఎం కుర్చీలో కూర్చున్నారన్న ముఖ్య కారణం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. అన్ని విధాలుగా జగన్‌కు ఆయన సహకరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన విరోధి కావడంతో పాటు.. తిరిగి ఏపీకి చంద్రబాబే సీఎం అయితే తన ఆటలు సాగవన్న కారణం కూడా జగన్‌కు కేసీఆర్ సహకరించేలా చేసింది. అప్పటి నుంచి కేసీఆర్ విషయమై జగన్ తన విధేయతను ప్రదర్శిస్తూనే ఉన్నారు. అంతెందుకు రేపు ఎన్నికలు అనగా కూడా కేసీఆర్ కోసం జగన్ పని చేశారని ప్రచారం జరుగుతోంది. నాగార్జున సాగర్ వద్ద హై టెన్షన్ క్రియేట్ చేయడం వెనుక వ్యూహం కేసీఆర్‌కు సహకారం అందించడమేనన్న టాక్ నడుస్తోంది.
సోషల్ మీడియా ద్వారా అయినా స్పందించలేదే?
ఇక తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయారు. ఆ తరువాత కాలికి గాయమై యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు కానీ జగన్ ఎక్కడ? కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా స్పందించలేదే? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి యూజ్ అండ్ త్రో అనేది జగన్‌కు తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు. జగన్ అధికారంలోకి రావడానికి ఎంతగానో ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల శ్రమించారు. షర్మిల అయితే రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేశారు. అలాంటి వారినే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు చెల్లిని ఆ తర్వాత తల్లిని పార్టీలో నుంచి.. ఆపై రాష్ట్రం నుంచే సాగనంపారు.
ఆయనేమైనా అధికారంలో ఉన్నారా?
ఇక కొన్ని దశాబ్దాలుగా ఎమ్మెల్యేలు మేకపాటి, కోటంరెడ్డి, ఆనంలు జగన్ కుటుంబానికి ఎంతో సేవనందించారు. రాజకీయంగానూ వారు పార్టీకి ఎంతో సేవ చేశారు. అలాంటి వారిని అవసరం తీరాక పార్టీ ద్రోహులంటూ బయటకు గెంటేశారు. ఇలా ఒకరేంటి? ఎందరినో అవసరం తీరాక జగన్ వదిలించుకున్నారు. అలాంటి జగన్.. కేసీఆర్‌ను మాత్రం ఎందుకు పట్టించుకుంటారు? ఆయనేమైనా అధికారంలో ఉన్నారా? లేనప్పుడు ఆయనతో ఏం పని? ఒకవేళ వచ్చి పరామర్శించినా కూడా కంటితుడుపు చర్యే అవుతుంది. కానీ మనస్ఫూర్తిగా మాత్రం పరామర్శించరని టాక్. జగన్‌ను నమ్ముకున్న వాళ్ల పరిస్థితి ఎప్పటికైనా ఇదేననే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్టీలో కొందరు నేతలు అసంతృప్తిలో ఉన్నా కూడా వారు బయటకు వెళ్లలేని పరిస్థితి. అధికారం చేతికి రాగానే ఇష్టానుసారంగా ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు వైసీపీలో ఉండలేక.. బయటకు వెళ్లలేక నానా తంటాలు పడుతున్నారు.