కూల్చివేతలతో ఏపీ సీఎం జగన్ అధికారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మూడు రాజధానుల కాన్సెప్ట్ అందుకున్నారు. అప్పటి నుంచి విశాఖకు రాజధానిని తరలిస్తా అంటూ అమావాస్యకొకసారి.. పౌర్ణమికొకసారి ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకూ రాజధానిని తరలించిందీ లేదు.. తాను వద్దనుకున్న అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నది లేదు. అమరావతికి భూములిచ్చిన రైతులు ఏం చేయాలో పాలుపోక ఎటూ తేల్చని జగన్ నిర్ణయం కోసం ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అమరావతి ఉద్యమం ఇప్పటికే నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. కానీ దాని గురించి జగన్ ఆలోచన కూడా చేయడం లేదు.
పెద్ద లిస్టే వైరల్ అవుతోంది...
ఇక రానున్న ఎన్నికల్లో రాజధాని అంశాన్నే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అస్త్రంగా చేసుకుని ముందుకు సాగనున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ మాట మార్చడాన్ని హైలైట్ చేయనున్నారు. మాట తప్పను.. మడం తిప్పనన్న జగన్ ఎన్ని విషయాల్లో మాట మార్చారనే అంశాన్ని సైతం హైలైట్ చేయనున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక పెద్ద లిస్టే వైరల్ అవుతోంది. అధికారంలోకి రావడానికి ముందు జగన్ ఏమేం హామీలు గుప్పించారనే లిస్ట్‌ను టీడీపీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అన్నింటికీ తోడు రాష్ట్రానికి రాజధాని ఏదంటే ఠక్కున చెప్పలేని దుర్భర పరిస్థితిలో ఉండటం ఏపీ ప్రజానీకానికి ఆగ్రహం తెప్పిస్తోంది.
కృష్ణా తీరానికే అనుకూలంగా పరిస్థితులు..
మొత్తంగా 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపును డిసైడ్ చేయడంలో రాజధాని అంశమే కీలకంగా మారనుంది. అలాగే ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలు.. టీడీపీ అధినేత చంద్రబాబు సహా ప్రతిపక్ష నేతలందరిపై కక్ష సాధింపులు.. పరిశ్రమలు తరలిపోవడం.. పోలవరం.. ప్రత్యేక హోదా వంటివన్నీ ఈ ఎన్నికల్లో హైలైట్ కానున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ 2024 ఎన్నికలు రాష్ట్ర రాజధానిని డిసైడ్ చేసే ఎన్నికలు కానున్నాయి. సాగర తీరమా?.. కృష్ణా తీరంలో రాజధానా? అనే ఉత్కంఠకు 2024 ఎన్నికలతో క్లారిటీ వచ్చేస్తుంది. జగన్ గెలిస్తే.. సాగర తీరం.. చంద్రబాబు గెలిస్తే కృష్ణా తీరం. మొత్తానికి పరిస్థితులు చూస్తుంటే మాత్రం కృష్ణా తీరానికే అనుకూలంగా మారతాయనే అనిపిస్తోంది. ఇక చూడాలి మున్ముందు ఏం జరగనుందో..