రైతులను పరామర్శించిన జగన్‌పై ఇన్ని విమర్శలా?
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌తో ప్రతి విషయంలోనూ ఏపీ సీఎం జగన్‌ను పోలుస్తూ ఉండేవారు. అయితే అన్ని విషయాల్లోనూ కేసీఆరే టాప్‌లో ఉండేవారు. ఒక్క విషయంలో మాత్రం జగన్ టాప్‌లో ఉన్నారు. ఇంతకీ ఆ విషయం ఏంటో తెలుసా? విపత్తు. తెలంగాణలో తుఫానులు వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్‌ను వీడింది లేదు. లేదంటే ప్రగతి భవన్‌లో కూర్చొన్నారు. చివరకు 100 ఏళ్లలో ఎన్నడూ రానంత వరద వచ్చి హైదరాబాద్ మొత్తం నీట మునిగిపోతున్నా.. రోమ్ నగరం తగలబడి పోతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి మాదిరిగా ప్రగతి భవన్‌లో కూర్చొన్నారు కానీ బయటకు రాలేదు. కానీ ఏపీ సీఎం జగన్ అలా కాదండోయ్.. జనాల్లోకి వెళ్లారు. పరామర్శించారు. అభయ హస్తం అందించారు.
జగన్‌కు ఏం పని?
ఇక మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీ రైతాంగం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్.. కేసీఆర్ మాదిరిగా తాడేపల్లి ప్యాలెస్‌కు అంకితమవలేదు. అలాగని టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరిగా ఆత్రం ఆత్రంగా జనాల్లోకి వెళ్లలేదు. చంద్రబాబు కంటే వయసు మీరింది కాబట్టి కాస్త ఛాదస్తంతో కష్టమనగానే గబగబా వెళ్లారు. పైగా పొలాల్లోకి దిగి మరీ పంట నష్టాన్ని పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. కానీ జగన్‌కు ఏం పని? ఆయన చాలా జాగ్రత్తగా షూకి బురద అంటకుండా.. ఎండ తగలకుండా అన్ని ఏర్పాట్లూ వాటంతట అవే జరిగిపోతాయి. ఎర్ర తీవాచిపై నిలబడి పంటలను పరిశీలిస్తారు. ఇంకా అవసరమనుకుంటే.. వరి దుబ్బలకే కాళ్లొచ్చి తనను పరిశీలించమంటూ జగన్ చేతిలో ఒదిగిపోతాయి.
నానా యాగీ చేయడమేంటి?
ఉల్లిగడ్డను పొటాటో అంటారని అంటారు. ఇంకా మాట్లాడితే.. వరి అంటే షుగర్ కేనే కదా? అని కూడా అడుగుతారు. జస్ట్ జనాలకు తెలుసో లేదోనని టెస్టింగ్. దానికే తప్పుబట్టేసి ముసి ముసి నవ్వులు నవ్వుతూ నానా యాగీ చేయడమేంటి? జగన్ ఏమైనా కేసీఆర్ మాదిరిగా తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఫిడేలు వాయించుకోలేదుగా.. అదే తప్పైందా? ఎందుకు పదే పదే జగన్‌పై విమర్శలు? చక్కగా వెళ్లి రైతులను పరామర్శించి.. హామీల మీద హామీలు గుప్పించి వస్తే.. చంద్రబాబు మాదిరిగా బురదలోకి దిగలేదని.. తుళ్లి పడకుండా పట్టుకునేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారంటూ విమర్శలా? ఏదో సామెత చెప్పినట్టుందే యవ్వారం.. అటు చూస్తే ఉద్యోగులు విరుచుకుపడుతున్నారు. ఇటు చూస్తే జనం ఏం చేసినా తప్పు బడతారా? ఇది మరీ బాగుంది. నవ్వే వాళ్లు నవ్వుతూనే ఉంటారు నువ్వు ప్రొసీడ్ జగనన్న..