తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళుతున్నారు. మరి ఈ దూకుడును చివరి వరకూ కొనసాగిస్తారో లేదో కానీ ఇప్పుడు మాత్రం నిర్ణయాలన్నీ దూకుడుగా తీసుకుంటూ జనం మనసుల్లో హీరోగా నిలుస్తున్నారు. ప్రజాదర్బార్‌తో జనాలకు బాగా దగ్గరయ్యారు. ప్రతి ఒక్కరినీ ముఖ్యమంత్రి హోదాను పక్కనబెట్టి ఏదో ఒక వరసతో అప్యాయంగా పిలుస్తుండటంతో జనం కూడా మురిసిపోయారు. మహిళలకు నేటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి తెలంగాణలో మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. ఆరు గ్యారెంటీ స్కీమ్‌లో భాగంగా ఒకదానిని నేటి నుంచే అమల్లోకి తీసుకురానుండటం విశేషం.
ఆ ఆలోచన కూడా పదేళ్లలో కేసీఆర్‌కు రాలేదా?
ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఎందరో పోరాటాలు సాగించారు. వారి పోరాట ఫలితంగానే తెలంగాణ వచ్చిందనడంలో సందేహం లేదు. కానీ బీఆర్ఎస్ మాత్రం వారిని పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలు అయితే వెల్లువెత్తాయి. కనీసం ఉద్యమం కోసం అంతలా పోరాడిన ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలనే ఆలోచన కూడా ఈ పదేళ్లలో కేసీఆర్‌కు రాలేదని ఉద్యమకారులంతా ఆరోపిస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా రేవంత్ ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని జిల్లా ఎస్పీలను డీజీపీ ఆదేశించారు. త్వరలోనే ఉద్యమకారులపై కేసులు ఎత్తి వేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
వేలాది మందిపై కేసులు..
ముందుండి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినా కూడా సకల జనులు ఈ ఉద్యమంలో పాల్గొనడం వల్లే ఉవ్వెత్తున ఎగిసింది. ఈ క్రమంలోనే వేలాది మందిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు పెట్టింది. చాలా మంది అరెస్ట్ అయ్యి జైలు జీవితాన్ని సైతం గడిపారు. ఇప్పుడు 2009 నుంచి 2014 జూన్ 2 వరకూ తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసులు ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. నిర్ణయించిందే తడవుగా.. అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేయడం.. ఒక ప్రొఫార్మ్‌ను కూడా పంపించడం చకచకా జరిగిపోయాయి. మొత్తానికి రేవంత్ అయితే ప్రజాకర్షక నిర్ణయాలైతే తీసుకుంటున్నారు. మరి ఇది తను అధికారంలో ఉన్నంత కాలం కొనసాగిస్తారా? లేదంటే ఖజానా ఖాళీ అవుతుందని భయపడి వెనుకడుగు వేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.