తన భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో హీరోయిన్ నయనతార అక్కగా నటించబోతోంది. హీరోకి అక్క పాత్రలో నయనతార ఈ చిత్రంలో నటించబోతోంది. ఇంతకీ హీరో ఎవరని అనుకుంటున్నారా? లవ్ టుడే వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న యంగ్ దర్శకుడు, ప్రదీప్ రంగనాధన్. ఆయన హీరోగా విగ్నేష్ శివన్ ఒక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రదీప్‌కి అక్కగా నయనతార అనగానే.. ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఎందుకంటే..
ఇంత వరకు నయనతార హీరోయిన్‌గానే చేసింది. ఇప్పుడు అక్క పాత్రలో అనగానే ఒక్కసారిగా అటెన్షన్ వచ్చేసింది. అందుకే ఈ సినిమా గురించి చర్చలు బాగా నడుస్తున్నాయి. ఇందులో ప్రదీప్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ నటిని ఎంపిక చేసినట్లుగా సమాచారం. సెవెన్ స్క్రీన్స్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితం కానుంది. ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి టైటిల్ కూడా ఖరారు చేశారు.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ షార్ట్‌గా ఎల్ఐసీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇందులో సీనియర్ దర్శకనటుడు ఎస్ జే సూర్య, యోగిబాబు కీలక పాత్రలను పోషించనున్నట్లు తెలుస్తోంది. తన భర్త రెడీ చేసిన స్టోరీ నచ్చడంతో హీరోకి అక్కగా నటించేందుకు నయనతార ఓకే చెప్పిందని టాక్. తన భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నానుమ్ రౌడీదాన్, కాత్తువాక్కుల రెండు కాదల్ అనే చిత్రాల్లో నయనతార నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ముచ్చటగా ఇది మూడో చిత్రం.