తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఆయన ప్రమాణ స్వీకార సమయంలో స్వల్ప మార్పు జరిగినట్లుగా తెలుస్తోంది. ముందు ప్రకటించినట్లుగా ఉదయం 10గంటల 28 నిమిషాలకు కాకుండా మధ్యాహ్నం 1 గంట 04 నిమిషాలకు రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అతిరథ మహారథులు హాజరవుతున్నట్లుగా టాక్ వినబడుతోంది.
మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన రేవంత్.. తన ప్రమాణ స్వీకారోత్సవానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించారు. అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా ప్రత్యేకంగా కలిసి ఆహ్వానం పలికారు. ఇంకా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వంటి వారందరినీ ఈ వేడుకకు రేవంత్ ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. వీరితో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలకు కూడా ఆహ్వానం వెళ్లినట్లుగా సమాచారం.
మరోవైపు రేవంత్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్యురిటీకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది. మరి ఈ వేడుకకు ఎవరెవరు హాజరవుతారనేది తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు.