తెలంగాణ దంగల్ అయితే ముగిసింది. లోకల్, నేషనల్ సంస్థలన్నీ ఎగ్జిట్ పోల్స్ నిన్న ఇచ్చేశాయి. ఇక మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అయితే కాంగ్రెస్‌కే అధికారాన్ని కట్టబెట్టాయి. దీనికి రకరకాల కారణాలను సర్వే సంస్థలు వెల్లడించాయి. అధికార పార్టీ అయితే ఈ ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మడం లేదు. మంత్రి కేటీఆర్ 70కి పైగా స్థానాల్లో అధికారంలోకి వస్తామని చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నామన్నారు. రియల్ పోల్ రిజల్ట్ డిసెంబర్ 3న వస్తుంది కాబట్టి కార్యకర్తలు ఎవరూ కంగారపడవద్దని సూచిస్తున్నారు. డిసెంబర్ 3 న తప్పని తేలితే ఎగ్జిట్ పోల్స్ చేసినవారు ప్రజలకి క్షమాపణ చెబుతారా? అని మరీ ప్రశ్నిస్తున్నారు.
పథకాలన్నీ పార్టీ నాయకులకే..
బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు ఎలా ఉన్నా కూడా ఆ పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి గల కారణాలను సర్వే సంస్థలు వెల్లడించాయి. ఒక సర్వే సంస్థ వచ్చేసి.. బీఆర్ఎస్ పార్టీకి వరుసగా రెండు సార్లు అవకాశం ఇచ్చామని ఇప్పుడు వేరే పార్టీకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో చూడాలని జనం భావిస్తున్నారని చెప్పుకొచ్చింది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలు సైతం జనాల్లో భారీ ఇంపాక్ట్‌ను క్రియేట్ చేశాయంటున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ టికెట్లను సిట్టింగ్‌లకు ఇవ్వడం.. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్‌కు శాపంలా మారిందట. దళిత బంధు, బీసీ బంధు వంటి పథకాలన్నీ కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, ఆ పార్టీ నాయకులకు మాత్రమే వస్తున్నాయనే అసంతృప్తి మెజారిటీ ప్రజలలో ఉండటం కూడా ఆ పార్టీకి నష్టం చేకూర్చనుందట.
వారంతా కాంగ్రెస్ వైపే..
బీఆర్ఎస్ చేసిన తప్పుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే అతిపెద్ద తప్పు అని ఆరా మస్తాన్ సర్వే సంస్థ స్పష్టం చేసింది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఇక్కడ ధర్నాలు, ఆందోళనలు చేయవద్దని కేటీఆర్ పేర్కొనడం తెలంగాణలో సంచలనం రేపాయి. తెలంగాణలో టీడీపీకి కేడర్ బాగానే ఉంది. పైగా ఏపీ సెటిలర్స్ తెలంగాణలో పెద్ద ఎత్తున ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ వైపే నిలిచారని ఆరా సంస్థ తెలిపింది. అలాగే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చడం వల్ల కూడా ఆ పార్టీ నష్టపోయిందట. ఇక కవిత లిక్కర్ స్కాం అయితే రెండు పార్టీలకు దెబ్బేసిందట. కవిత స్కాం చేశారని జనాలకు నమ్మడంతో బీఆర్ఎస్.. ఆమెను అరెస్ట్ చేయకపోవడంతో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని భావించడంతో కమలం పార్టీకి జనం వ్యతిరేకమయ్యారని ఆరా సర్వే వెల్లడించింది.