సిగ్గు సిగ్గు.. ఓటేసేందుకు కదలని హైదరాబాద్ ప్రజానీకం..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే సాయంత్రం 4 గంటలకే పూర్తైంది. సాయంత్రం 5గంటల వరకు సుమారు 63.94 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. అత్యధికంగా మెదక్ జిల్లాలో 80.28 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.97 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకా కొంత మంది 5 గంటల సమయానికి పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో ఉన్నారు. వారిని ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు.
సంస్థలన్నీ సెలవు ఇచ్చేశాయ్..
అయితే వారు ఓటు వేసినా కూడా పోలింగ్ శాతంలో స్వల్ప మార్పు వస్తుంది తప్ప బీభత్సమైన మార్పు వచ్చే అవకాశమైతే లేదు. అత్యధికంగా విద్యావంతులు ఉన్నది హైదరాబాద్‌లో.. కానీ ఇక్కడ పోలింగ్ మాత్రం అత్యల్పం. మహానగరం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యావంతులు ఎక్కువగా ఉన్న నగరంలో ఇంత తక్కువ పోలింగా? సిగ్గు సిగ్గు.. సంస్థలన్నీ సెలవు ఇచ్చేశాయి. అయినా కూడా ఇల్లు వదిలి బయటకు రాలేకపోయారో... లేదంటే ఈ సెలవును కూడా తమ ఎంజాయ్‌మెంటుకు వినియోగించుకున్నారో కానీ కాసేపు క్యూలైన్‌లో నిలబడి ఓటు వేయలేకపోయారు.
ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ నీతులు..
వీకెండ్ వస్తే చాలు.. పబ్బులని.. క్లబ్బులని.. ట్యాంక్ బండ్ అంటూ అర్థరాత్రి వరకూ తిరిగే హైదరాబాద్ జనానికి ఓటేసే తీరిక లేకుండా పోయింది. సోషల్ మీడియా చూస్తే ఓటు హక్కును వినియోగించుకోమంటూ నీతులు. రీల్స్ చేసి పెద్ద ఎత్తున యూత్ హోరెత్తించారు. మరి నిజ జీవితం విషయానికి వస్తే.. ఆ రీల్స్ చేసిన వారిలో ఎందరు ఓటేశారో కూడా డౌటే. గ్రామీణ ప్రజానీకమే మేలు. పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంది. చదువుకున్న వారికే ఓటు హక్కును వినియోగించుకోవాలన్న స్పృహ లేకుండా పోయింది.