టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అనేది ఆయన జీవితంలోనే ఎన్నడూ చూడని.. ఎదుర్కోని పరిణామం. ఆధారాలు సైతం చూపని కేసులో చంద్రబాబును 50 రోజుల పాటు జైల్లో ఉంచిన ఘనత ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిదే. టీడీపీ శ్రేణులు ఆయన ఇలా జైలుకు వెళ్లి అలా తిరిగొస్తారని భావించారు కానీ అదేమీ జరగలేదు. టీడీపీకి కాలం కలిసిరాలేదో.. లేదంటే జగన్‌కు అనుకూలంగా ఉందో కానీ టీడీపీ అధినేత 50 రోజులకు పైనే జైల్లో ఉండిపోయారు. ఆయన ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బందిపెట్టింది. ఈ క్రమంలోనే ఆయన జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి బాల్ టీడీపీ కోర్టులోకి వచ్చి పడింది. టీడీపీ ఆట మొదలు పెట్టింది.
ఒక్కో కేసు నుంచి మెల్లమెల్లగా ఊరట..
అసలు చంద్రబాబును జైల్లో పెట్టడమే పెద్ద సెల్ఫ్ గోల్ అంటే ఇక చంద్రబాబు బయటకు వచ్చిన దగ్గర నుంచి వైసీపీకి అనుకోని గోల్స్ మొదలయ్యాయి. అసలు ఆయన బెయిలే రాకుండా చూడాలనుకున్నారు. కానీ అది కుదరలేదు. రెగ్యులర్ బెయిల్ రాకుండా చూడటం కోసం జగన్ శతవిధాలుగా యత్నించారు. అది కూడా జరగలేదు. టైం కూడా చంద్రబాబుకు సహకరించడం మొదలు పెట్టినట్టుంది. ఒక్కో కేసు నుంచి మెల్లమెల్లగా ఊరట లభిస్తోంది. తాత్కాలిక బెయిల్ నుంచి రెగ్యులర్ బెయిల్ రావడం టీడీపీకి చాలా హ్యాపీనిచ్చే విషయమని చెప్పాలి. అటు కేడర్‌లోనూ ఎక్కడ లేని జోష్ తిరిగి వచ్చేసింది. ఇరుపాక్షల లిఖిత పూర్వక వాదనలు విన్న హైకోర్టు తీర్పుని రిజర్వ్ లో ఉంచింది. ఇది కూడా టీడీపీకి ఫేవర్‌గా వచ్చే అవకాశం ఉంది.
ఢిల్లీలో ప్రత్యక్షమైన చంద్రబాబు..
ఫైనల్ తీర్పు వెలువరించేంత వరకూ చంద్రబాబుపై కానీ.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పై కానీ ఎటువంటి ముందస్తు చర్యలకు పాల్పడొద్దని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఇది వైసీపీకి ఊహించని పరిణామం. చంద్రబాబు విషయాల్లో వరుస విజయాల్లో ఉన్నామని కాబట్టి ఎన్నికలయ్యే వరకూ ఆయన్ను జైల్లోనే ఉంచాలని భావించింది. మొత్తానికి చంద్రబాబు తన రెగ్యులర్ బెయిల్ వచ్చిన అనంతరం నిన్న ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ఆయనను చూసి ‘బాబు ఈజ్ బ్యాక్’ అంటూ టీడీపీ శ్రేణులు నూతనోత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇక నేడు స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై వైసీపీ వేసిన పిటిషన్‌లో నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇది కూడా టీడీపీకి ఫేవర్‌గా వచ్చిందో వైసీపీ తీవ్ర నిరుత్సాహానికి గురవడం ఖాయం. జగన్ ప్రభుత్వం గీసిన స్కెచ్ నుంచి చంద్రబాబు పూర్తిగా బయటపడి ప్రజాక్షేత్రంలోకి త్వరగా అడుగు పెట్టాలని టీడీపీ శ్రేణులు గట్టిగా కోరుకుంటున్నాయి.