తెలంగాణలో ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 30న ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఓడిపోబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. సర్వేలు మాత్రం బీఆర్ఎస్‌కే పట్టం కడుతున్నాయి. అయితే తాజాగా ఓ నివేదిక మాత్రం కేసీఆర్‌కు షాకిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్‌తో జరిగిన మూడు గంటల మీటింగ్‌లో సీఎం కేసీఆర్‌కు ఆయన ఏమైతే చెప్పారో.. అదే విషయం సర్వేలో కూడా స్పష్టమైందంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీస్తోందని, ప్రజలు మార్పు కోరుకొంటున్నారని ఆ నివేదిక పేర్కొందంటూ ప్రచారం జరుగుతోంది.
కేసీఆర్ ఈ నెల 20వ తేదీన కేసీఆర్ ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌తో ప్రగతి భవన్‌లో రహస్యంగా భేటీ అయ్యారు. ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లాష్ సర్వే నిర్వహించి, ఇంటలిజన్స్ నివేదికలో పేర్కొన్నదే జరుగబోతోందని గ్రహించారని తెలుస్తోంది. మొత్తానికి ప్రశాంత్ కిషోర్‌తో పాటు సర్వే.. ఆ తరువాత ఫ్లాష్ సర్వే సైతం ఒకే విధమైన విషయాన్ని చెప్పారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైప మంత్రి కేటీఆర్ తాను పోటీ చేస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని కూడా కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ బతిమిలాడుకున్నారంటూ వైరల్ చేస్తోంది.
కాంగ్రెస్ వాళ్లు ఫేక్ ప్రచారం చేస్తున్నారని.. ఫేక్ ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ తమ క్యాడర్‌కు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో అసలేం జరుగుతోంది. ఇది కేవలం బీఆర్ఎస్ గురించి ఒక పార్టీ చేస్తున్న ప్రచారమేనా? లేదంటే నిజంగానే బీఆర్ఎస్ వెనుకబడుతోందా? అనేది జనానికి అర్థం కాకుండా ఉంది. ఎవరి పార్టీ కేడర్ వారి పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. తటస్థులే అసలేం జరుగుతోంది? ఎవరికి ప్రస్తుతం తెలంగాణ అనుకూలంగా ఉందనేది తెలియక కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. మొత్తానికి హ్యాట్రిక్ కొట్టాలని అయితే బీఆర్ఎస్ గట్టిగానే ట్రై చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సైతం శక్తియుక్తులన్నీ ఒడ్డుతోంది. ఇక తెలంగాణలో గెలిచేదెవరో మరికొద్ది రోజుల్లో తేలాల్సి ఉంది.