దేశానికి పట్టుగొమ్మలు పల్లెలు అంటారు. కానీ ఆ పల్లెలు ఎప్పుడో కానీ హైలైట్ కావు. తాజాగా ఒక గ్రామం గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. అది.. కామారెడ్డి నియోజకవర్గంలోని కోనాపూర్. ఇప్పుడు ఈ గ్రామం ఎందుకు హైలైట్ అవుతోంది? అంటారా? తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సెగలు పుట్టిస్తున్నాయి. సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేశారు. దీనికి కారణాలు ఏమైనా ఉండొచ్చు. కానీ ఈ రెండు నియోజకవర్గాలు చర్చనీయాంశంగా మారాయి. దీనికి కారణంగా కేసీఆర్ పోటీ చేయడం ఒకటైతే.. ఆయన పోటీ చేసిన గజ్వేల్ నుంచేమో బీజేపీ కీలక నేతల ఈటల రాజేందర్ బరిలో నిలవగా.. మరో స్థానం కామారెడ్డి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
ఈ రెండు చోట్ల కూడా కేసీఆర్‌కు బీభత్సమైన పోటీ ఇస్తున్నారు ఆ ఇద్దరు నేతలు. కేసీఆర్‌ను ఓడించి తీరుతామని చెబుతున్నారు. ఇక వీటిని పక్కనబెడితే.. కామారెడ్డిలోని ఒక గ్రామమే కోనాపూర్. కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలంలో అప్పర్ మానేర్‌కు డ్యామ్‌కు సమీపంలో కోనాపూర్ ఉంది. ఇది సీఎం కేసీఆర్ తల్లి వెంకటమ్మ స్వగ్రామం. కేసీఆర్ తండ్రి స్వగ్రామం సిద్దిపేట జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట కాగా.. ఆయన కోనాపూర్‌కు ఇల్లరికం వచ్చారు. అప్పర్ మానేర్ డ్యామ్ నిర్మాణ సమయంలో అంటే 1950లో ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. ఈ తరుణంలో ఆ ప్రాంతంలోని వారంతా వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే కేసీఆర్ తల్లిదండ్రులు చింతమడకు వెళ్లారు.
కేసీఆర్ చింతమడకలోనే జన్మించారు. అయితే ఆయన అక్కలు మాత్రం కోనాపూర్‌లోనే జన్మించారు. ఇది కోనాపూర్ హిస్టరీ. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడంతో కోనాపూర్ గ్రామం బీభత్సంగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికీ కోనాపూర్‌లో కేసీఆర్ అమ్మమ్మ వాళ్ల రెండంతస్తుల మేడ ఉందట. కానీ అది పూర్తిగా శిథిలావస్థకు చేరిందట. ఇక ఇటీవల ఈ గ్రామాన్ని మంత్రి కేటీఆర్ దత్తత తీసుకుని రోడ్లు, వంతెనలు, స్కూలు వంటివన్నీ కట్టించి అభివృద్ధి చేశారు. అయితే పాఠశాల మాత్రం ఎన్నికల కోడ్ కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడంతో కోనాపూర్ వాసులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇక ఈ దఫా కనుక కేసీఆర్ కామారెడ్డి నుంచి గెలిచి సీఎం అయ్యారో ఆ గ్రామవాసుల సంతోషం రెట్టింపవుతుందనడంలో సందేహం లేదు.