ఈ సారి ఎన్నికలు గులాబీ పార్టీకి చావో రేవో అన్నట్టుగా మారాయి. కాంగ్రెస్ పార్టీ బీభత్సంగా పుంజుకోవడంతో.. బలంగా పోటీ ఇస్తోంది. టాక్ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీదేనని బాగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే గులాబీ బాస్ సైతం పాలిచ్చే గేదెను వదులుకోవద్దంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ హిస్టరీలోనే ఇలాంటి వ్యాఖ్యలు లేవు. పైగా కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులను నిత్యం అప్రమత్తం చేస్తున్నారు. రోజూ ఉదయాన్నే అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ఇతర ముఖ్యనాయకులతో కేసీఆర్ నేరుగా ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. నాయకుల మధ్య సమన్వయం లేదనిపిస్తే.. ఆ వెంటనే నియోజకవర్గాల్లో కింది స్థాయి నేతలతో సైతం మాట్లాడేందుకు కేసీఆర్ వెనుకాడటం లేదట.
కాంగ్రెస్ తప్ప మరో మాట వినిపించడం లేదు..
గతంలో కేసీఆర్, బీఆర్ఎస్ మంత్రుల నోళ్లలో బండి సంజయ్ తదితర బీజేపీ నేతల పేర్లు వినిపిస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ తప్ప మరో మాట వినిపించడం లేదు. కాంగ్రెస్‌ను బాగా ఫాలో అవుతున్నట్టు గులాబీ నేతల మాటలు వింటుంటే అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటిస్తే ఆ వెంటనే బీఆర్ఎస్ కూడా ప్రకటించేసింది. తెలంగాణలో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఏవో నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. ఎగ్జామ్ కూడా నిర్వహించారు. కానీ టీఎస్‌పీఎస్సీలో జరిగిన అవకతవకల కారణంగా అంతా కొలాప్స్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంలో కాస్త కేర్ తీసుకుంటే ఇదే అంశం గేమ్ చేంజర్ అవడంలో ఆశ్చర్యం లేదు.
తీవ్ర ఒత్తిడిలో బీఆర్ఎస్..
ఈ క్రమంలోనే నిరుద్యోగులను ప్రసన్నం చేసుకోవడంలో భాగంగా.. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తే.. ఆ వెంటనే స్పందించిన కేటీఆర్.. ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలండర్ విడుదల చేస్తుందని ప్రకటించారు. టీఎస్‌పీస్సీని ప్రక్షాళన చేయాలని ఎప్పటి నుంచో విపక్ష పార్టీలు, నిరుద్యోగులు మొత్తుకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన అంశాన్ని చేర్చగానే.. కేటీఆర్ సైతం ప్రక్షాళన చేస్తామంటూ ప్రకటించారు. మొత్తానికి గులాబీ నేతలైతే అధికారాన్ని కోల్పోతామనే తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు అయితే తెలుస్తోంది. సర్వేలు సైతం పార్టీకి అనుకూలంగా రాకపోవడం ఇబ్బందికరంగా తయారైంది. దీంతో మళ్లీ ప్రాంతీయవాదాన్ని సైతం కేసీఆర్ నెత్తికెత్తుతున్నారు. కాంగ్రెస్ అంటే ఢిల్లీ నేతల పాలన అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. మరి చూడాలి జనం ఎటు వైపు మొగ్గు చూపిస్తారో..