ఎన్నికల్లో ఓడినోడు పోలింగ్ బూత్ దగ్గర ఏడుస్తాడు.. గెలిచినోడు ఇంటికెళ్లి ఏడుస్తాడు అంటారు. అది అక్షరాలా నిజం. ఓడినోడంటే ఓటమి బాధతో ఏడుస్తాడు. గెలిచినోడు పెట్టిన ఖర్చు గుర్తొచ్చి ఏడుస్తాడు. ఇప్పుడు ఎన్నికల్లో గెలవడమంటే సాధారణ విషయమేమీ కాదు. డబ్బు మూటలు కుమ్మరించాలి. ఎమ్మెల్యేగా గెలవడం అనేది ప్రతి ఒక్క నేత కల. ఒకవేళ గెలిచారా? రెండోసారి దాన్ని నిలబెట్టుకోవడం కోసం తపన పడుతుంటారు. ఇది ఓ సైక్లింగ్. నిరంతర ప్రక్రియ. ఏం చేసి అయినా గెలవాల్సిందేనని భావిస్తూ ఉంటారు. ఎంత డబ్బు ఖర్చైనా వెనుకాడరు. ఆస్తులు తాకట్టు పెట్టడమో.. అమ్మేయడమే.. అప్పులు తేవడమో.. ఏదో ఒకటి చేయాల్సిందే. ఇక ఇన్నీ చేసీ.. అయితే ఎమ్మెల్యే.. లేదంటే బికారి.
పార్టీ నుంచి టికెట్ దక్కుతుందా? లేదా?
ముఖ్యంగా ఒక అభ్యర్థి ప్రచార ఖర్చే తడిసి మోపెడవుతోంది. తమ ప్రత్యర్థి ప్రచారంలో ఎంత ఖర్చు చేస్తున్నాడో తెలుసుకుని దానికి మించి ఖర్చు పెట్టాలి. హంగూ ఆర్భాటాల కోసం పాకులాడుతున్నారు. అలా చేస్తేనే ఓటరు కూడా అట్రాక్ట్ అయ్యేది. ఇక ఆ తరువాత కుల, మత, వర్గ రాజకీయాలు ప్రారంభమవుతాయి. ప్రతి ఒక్కరినీ వారికి అవసరమైన తాయిలాలు ఇచ్చి సంతోషపెట్టాల్సిందే. తొలుత పార్టీ నుంచి టికెట్ దక్కుతుందా? లేదా? అన్న టెన్షన్. దక్కిందా? ఇక చూడు.. ఎన్నికల ప్రచారానికి ఎంత ఖర్చవుతుంది? నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ఎంత? ఓటుకు ప్రత్యర్థి ఎంత ఇస్తున్నాడు? మనం ఎంత ఇవ్వాలన్న లెక్కలు మొదలవుతాయి. అందుకు కావల్సిన మొత్తాన్ని ఎలా సమకూర్చుకోవాలనే మీమాంశ ప్రారంభమవుతుంది.
ముప్పంతా ప్రతిపక్ష పార్టీలకే...
తెలంగాణలో అయితే అభ్యర్థులంతా ఇప్పటికే కావల్సిన మొత్తాన్ని సమకూర్చుకున్నారట. అధికార పార్టీ అయితే ఒక్కో నియోజకవర్గానికి పార్టీ ఫండ్ కింద కొంత మొత్తాన్ని పంపించేసిందట. ప్రతిపక్ష పార్టీలకే వచ్చిన ముప్పంతా. వారి ఎన్నికల ఖర్చంతా వారే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కొందరైతే ఎన్నారైల సాయం కోరుతున్నారట. వికారాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి తన ఆస్తులను తాండూర్ నియోజకవర్గ నేత దగ్గర తాకట్టు పెట్టినట్టు సమాచారం. బీజేపీ అభ్యర్థి ఒకరు తన ఫామ్ హౌస్‌ను తనఖా పెట్టి డబ్బు సమకూర్చుకున్నారట. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఓ కాంగ్రెస్ అభ్యర్థి తన హైదరాబాద్‌లోని స్థలం అమ్మేశారట. ఇలా చాలా మంది స్థలాలు, పొలాలు అమ్ముకుని డబ్బు సమకూర్చుకోగా.. కొందరు ఎన్ఆర్‌ఐలు, వ్యాపారవేత్తల వద్ద ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టి డబ్బు సమకూర్చుకున్నారట.