టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ లభించింది. బాబుకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ కేసులో అరెస్టై 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు గడిపిన విషయం తెలిసిందే. చంద్రబాబు అనారోగ్య సమస్య దృష్ట్యా హైకోర్టు నాలుగువారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 28 వరకు మధ్యంతర బెయిల్ లభించింది. ఇటీవల స్కిల్ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటీషన్‌పై హైకోర్టులో మూడు రోజులు పాటు వాదనలు జరిగాయి.
ఇక మొదలెడదామా..!
చంద్రబాబుకి సాధారణ బెయిలు మంజూరు చేయాలంటూ చంద్రబాబు తరుపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి ఈ నెల పదిహేడున తీర్పుని రిజర్వ్‌లో ఉంచారు. నేడు హైకోర్టు చంద్రబాబుకి సాధారణ బెయిలు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. మొత్తానికి చంద్రబాబుకి బెయిల్ అయితే వచ్చేసింది. ఇక ఆయన ఈ నెల 29 నుంచి జనంలోకి వెళ్లడానికి మార్గం సుగమం అయ్యింది. ఇప్పటి వరకూ ఆసుపత్రికి తప్ప బయటకు రాని చంద్రబాబు ఇక మీదట జనంలోకి వెళ్లనున్నారు. దీంతో ఏపీలో పరిస్థితులు ఎలా మారనున్నాయనేది ఆసక్తికరంగా మారింది.
వాట్ నెక్స్ట్..!
ఇక టీడీపీ - జనసేన పొత్తుకు సంబంధించిన కార్యక్రమాలను వేగవంతం చేయనుంది. ఏపీలో రాజకీయాలు ఇక మీదట కీలక మలుపు తీసుకోనున్నాయి. చంద్రబాబు జనంలోకి వెళితే పరిస్థితులు పూర్తిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్‌తో సింపతి బాగా వచ్చింది. ఈ క్రమంలోనే చంద్రబాబును జనంలోకి వెళ్లనివ్వకూడదని వైసీపీ విశ్వప్రయత్నాలు చేసింది. అయినా కూడా అవేమీ కలిసి రాలేదు. చివరకు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది. ఇప్పటికే చంద్రబాబుకు బెయిల్ వస్తే ఒకలా.. లేదంటే మరో స్కెచ్ వేసుకుని టీడీపీ-జనసేనలు కూర్చొన్నాయి.