తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టి పదేళ్లవుతోంది. ఈ పదేళ్లలో కేసీఆర్ తనకు తిరుగు అనేదే లేకుండా చేసుకున్నారు. అయితే ఈసారి మాత్రం బీఆర్ఎస్‌కు కాస్త ఎదురు గాలి అయితే వీస్తోంది. కాంగ్రెస్ బీభత్సంగా బలం పుంజుకుని ఎదురు వచ్చి నిలిచింది. తొలిసారి సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల నుంచి బరిలోకి దిగడంపై ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది. ఏదైనా ఒకచోట నుంచి అయినా గెలవొచ్చనే కారణంతో ఆయన బరిలోకి దిగుతున్నారట. ఇక గజ్వేల్‌లో కేసీఆర్‌కు పోటీగా బీజేపీ స్ట్రాంగ్ అభ్యర్థి ఈటల రాజేందర్ బరిలో నిలిచారు. గతంలో హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఈటలను ఓడించాలని బీఆర్ఎస్ పార్టీ అస్త్ర శస్త్రాలన్నింటినీ ఉపయోగించింది.
కేసీఆర్‌ను ఓడించారో..
మంత్రులందరినీ హుజూరాబాద్‌పై మోహరించింది. అయినా ఫలితం శూన్యం. ఈటల విజయం సాధించారు. ఇప్పుడు అదే ఈటల గజ్వేల్‌లో కేసీఆర్‌కు పోటీగా బరిలోకి దిగారు. ఇక్కడ కానీ కేసీఆర్‌ను ఈటల ఓడించారంటే ఆయనంత పోటుగాడు లేడనే చెప్పాలి. మరి ఓడించే అవకాశం ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఇక కామారెడ్డి విషయానికి వస్తే అక్కడ కేసీఆర్‌కు పోటీగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలోకి దిగారు. మరి సీఆర్‌ను రేవంత్ ఓడించగలరా? అంటే ఇక్కడ ఔననే సమాధానమే వినిపిస్తోంది. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నుంచే గత ఎన్నికల్లో విజయం సాధించలేని వ్యక్తి ఇప్పుడు పోటీ చేసి విజయం సాధిస్తారా? అంటే సాధిస్తారనే సమాధానమే వినిపిస్తోంది.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్..
ఒకవేళ కేసీఆర్‌పై రేవంత్ గెలిచినా కూడా ఆ క్రెడిట్ ఆయనకు పెద్దగా దక్కదు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ను కేసీఆర్ జైలుకి పంపించారు. నిజానికి ఆయన జీవితంలో అది పెద్ద మచ్చగా ఎప్పటికీ నిలిచిపోతుంది. అలాంటి రేవంత్.. కేసీఆర్‌ను ఓడించాలనుకోవడంలో తప్పు లేదు. దీనికోసం రేవంత్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే ఇక్కడ రేవంత్‌కు కలిసొచ్చే అంశం ఏంటంటే.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్. దీని వలన ఏడు మండలాలలో రైతులు భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వారంతా తమ భూముల కోసం ఎంత పోరాడినా కనీసం కేసీఆర్ ప్రభుత్వం కనికరం చూపలేదు. ఇప్పుడు వారంతా ఎన్నికల బరిలోకి దిగారు. కొందరు ఉపసంహరించుకున్నాకూడా ఇంకా 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి కారణంగా ఓట్లు చీలి కాంగ్రెస్‌కు లాభం.. బీఆర్ఎస్‌కు నష్టం చేకూరే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభావం కూడా అన్ని చోట్ల బీభత్సంగానే ఉంది. ఇక చూడాలి కేసీఆర్ గెలుస్తారో.. ఓడుతారో..