ఎన్నికల్లో ప్రధాన పాత్ర వహించే వాటిలో మేనిఫెస్టో ఒకటి. అందుకే అన్ని పార్టీలు చాలా జాగ్రత్తగా ఆలోచించి మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తాయి. ఒకరిని మించి ఒకరు పథకాలు చేపడుతారు. పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించిన తరువాత మేనిఫెస్టోకు రూపకల్పన ప్రారంభించాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే తాజాగా మేనిఫెస్టోను అయితే సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ పార్టీ ఎందుకోగానీ ప్రచారంలోనూ స్పీడ్ లేదు.. మేనిఫెస్టో విషయంలోనూ స్పీడ్ లేదు. సీనియర్ నేతలంతా పార్టీని వీడుతుండటం కూడా పార్టీని కుదిపేస్తోంది. కార్యకర్తలైతే అసలు పట్టించుకోవడమే లేదు. ఇక పార్టీని ఇలాగే వదిలేస్తే కష్టం అనుకున్నారో ఏమో కానీ బీజేపీ పెద్దలంతా తెలంగాణకు రానున్నారు.
నిరుద్యోగులు, మహిళలు, రైతులే టార్గెట్..
నేటి సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. బీజేపీ క్యాడర్‌లో ఫుల్ జోష్ నింపి.. మేనిఫెస్టోను సైతం ప్రకటించబోతున్నారట. ఇక ఈ మేనిఫెస్టోలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను మించిన అంశాలను చేర్చారట. వాటిలో కొన్ని కీలకాంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నిరుద్యోగులు, మహిళలు, రైతులపై ఫోకస్ పెట్టిందట. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే తెలంగాణలో ఉన్న ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేస్తుందట. మహిళలకు 5 వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం వంటి కీలక అంశాలతో మేనిఫెస్టోను సిద్ధం చేసినట్టు టాక్ నడుస్తోంది. విద్యార్థులకు సంబంధించి కూడా బీజేపీ మేనిఫెస్టోలో కీలక అంశాలు చేర్చినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు.
జాకీలు పెట్టి లేపినా లేవదేమో..
ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తమ మేనిఫెస్టోను ప్రకటించడమే కాకుండా వాటిలోని కీలక అ:వాలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ మేనిఫెస్టో మరింత ఆకర్షణీయంగా ఉంటుందట. బీజేపీ మేనిఫెస్టోలు ఎంత మేర వర్కవుట్ అవుతాయనేది అయితే తెలియడం లేదు. అసలే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి జాకీలు వేసి లేపినా లేవనట్టే ఉంది. ఇక బీజేపీ పెద్దలే కాదు.. ఏకంగా ప్రధాని మోదీ వచ్చినా కూడా పరిస్థితిలో మార్పు వచ్చేలా కనిపించలేదు. కనీసం పార్టీని సీనియర్లు వీడుతున్నారని తెలిసినా కూడా ఆపే నాథుడే బీజేపీలో కరువయ్యారు. పోతే పోనీ అన్నట్టుగానే ఉన్నాయి పరిస్థితులు. ఎన్నికల సమయంలో ఇలా ఉంటే ఎలా? పార్టీని నడిపించే ముఖ్య లీడర్లలోనే జోష్ లేకుంటే కార్యకర్తల్లో ఎక్కడి నుంచి వస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.