ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌కి వెళ్ళిపోయాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసే ప్రాజెక్ట్స్ అన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్సే కావడంతో.. ఆయనతో సినిమా చేయాలంటే దర్శకులు ఆ రేంజ్ కథతోనే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రభాస్‌కి ఫ్రెండ్‌గా ఆయన మేనేజర్‌గా మారిన నటుడు ప్రభాస్ శ్రీను ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి ఉండడం లేదు. కొన్ని సినిమాల్లో కలిసి కనిపించిన ప్రభాస్-శ్రీనులు ఇద్దరూ స్నేహితులయ్యారు. అప్పటినుంచి తన ఇంటిపేరుని కూడా ప్రభాస్ శ్రీనుగా మార్చుకుని ప్రభాస్ ఫ్యాన్స్‌కి మరింత దగ్గరయ్యాడు. ఆ తర్వాత ప్రభాస్‌కి పర్సనల్ అయ్యాడు.
ఎప్పుడూ ప్రభాస్‌తోనే ఉండే ప్రభాస్ శ్రీను ఈ మధ్య కలిసి కనిపించడం లేదు. దానితో ప్రభాస్ శ్రీనుతో ప్రభాస్‌కి విభేదాలు అందుకే ఇద్దరూ ఎక్కడా కలవడం లేదు అంటూ గుసగుసలు మొదలయ్యాయి. ఎన్నిసార్లు ప్రభాస్ శ్రీను ఈ విషయమై క్లారిటీ ఇచ్చినా కూడా ఈ గాసిప్స్‌కి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా ప్రభాస్ శ్రీను ఆ విషయమై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. నేను నటుడు అవుదామనే సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ప్రభాస్ గారితో నాకు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. అనుకోకుండా దొరికిన ఈ స్నేహం మా బంధాన్ని మరింత దగ్గర చేసింది. నేను, నా తీరు నచ్చి నన్ను ఆయన దగ్గరే పెట్టుకున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయినా మా ఫ్రెండ్‌షిప్‌లో ఎలాంటి మార్పు లేదు, ఉండదు.
అయితే ప్రభాస్‌గారితో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన కొన్ని సినిమా అవకాశాలు వదులుకున్నాను. దానికి నేనేమీ బాధ పడలేదు. కానీ గబ్బర్ సింగ్ సినిమా నాకు మంచి గుర్తింపు తేవడంతో నటుడిగా బిజీ అయ్యాను. ఆ తర్వాత వరసగా అవకాశాలు పెరగడంతో ప్రభాస్‌తో ఉంటూ ఆయన పనులు చూసుకుంటూ సినిమాలకు సమయం కేటాయించడం ఇబ్బందైంది. అటు షూటింగ్ ఇటు ప్రభాస్.. పని చేయడం కష్టమైంది, ప్రభాస్ గారు అప్పగించిన పని సక్రమంగా చేయలేకపోతున్నాను అని అనిపించింది. అప్పుడే ప్రభాస్‌తో మాట్లాడాను. మిర్చి తర్వాత పూర్తిగా సినిమాల్లోనే ఉండాలని అనుకుంటున్నట్లుగా చెప్పాను.
నీకు నటన అంటే ఇష్టం, అందుకే ఇండస్ట్రీకి వచ్చావు, ఇకపై ఫుల్ టైమ్ సినిమాల కోసం ట్రై చేయమని చెప్పారు. అక్కడ ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే తిరిగి నా దగ్గరకు వచ్చేయమని చెప్పారు. ఆ మాట ప్రభాస్‌గారు అన్న తర్వాతే.. నేను పూర్తిస్థాయిలో నటనపై దృష్టి పెట్టాను. అంతేకానీ మేము విడిపోలేదు అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్ శ్రీను.