అసలు ఎన్నికల సమయానికి అంటే మరో పది రోజుల్లో బీజేపీలో ఇప్పుడు టికెట్ దక్కిన నేతలు మినహా ఎవరూ ఉండే అవకాశమే కనిపించడం లేదు. వరుసబెట్టి కీలక వికెట్స్ అన్నీ పడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం తిరిగి బీజేపీకి బిగ్ షాక్. ఆ పార్టీకి కీలక నాయకురాలు విజయశాంతి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామాను కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. కొంతకాలంగా పార్టీలో ఆమెకు ప్రాధాన్యం తగ్గడంతో మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి కూడా ఆమె బీజేపీపై పరోక్ష విమర్శల్ని సోషల్ మీడియా వేదికగా గుప్పిస్తూ వస్తున్నారు. అప్పటి నుంచే రాములమ్మ పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది.
తల్లి తెలంగాణ పేరుతో పార్టీ..
మొత్తానికి తనకు ప్రాధాన్యం తగ్గడంతో పాటు కనీసం ఆమెను బుజ్జగించే యత్నం కూడా పార్టీ అగ్రనేతలు ఎవరూ చేపట్టకపోవడంతో ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే రాములమ్మ ఏ పార్టీలో చేరబోతున్నారు అనే విషయం మాత్రం తెలియరాలేదు. ఆమె కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ బీభత్సంగా ప్రచారం జరుగుతోంది. 1998లో సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి మొదట బీజేపీలోనే చేరారు. ఆ తరువాత తెలంగాణ ఉద్యమ సమయంలో తల్లి తెలంగాణ పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఆమె పార్టీ ఫ్లాప్ అయ్యింది. దీంతో తన పార్టీని 2009లో అప్పటి టీఆర్ఎస్‌లో విలీనం చేశారు.
మోదీకి స్వాగతం పలికిన రాములమ్మ..
విజయశాంతికి గులాబీ పార్టీలో సైతం సరైన గుర్తింపు దక్కలేదు. ఇక చివరగా 2020లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తిరిగి బీజేపీ గూటికి చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఈ నెల 11న అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో బేగంపేట్ ఎయిర్ పోర్టులో విజయశాంతి స్వాగతం పలికారు. దీంతో అంతా ఆమె మనసు మార్చుకున్నారని భావించారు. కానీ మోదీకి స్వాగతం పలికిన నాలుగు రోజుల్లోనే విజయశాంతి పార్టీకి రాజీనామా చేయడం చర్చకు దారితీసింది. ఇక ఇప్పుడు విజయశాంతి కాంగ్రెస్ జెండా పడతారా? లేదంటే రాజకీయాలకు దూరంగా ఉంటారా? అనేది తేలాల్సి ఉంది.