టీజర్ విడుదల తర్వాత ఆదికేశవ సినిమాని ఆచార్యతో పోలుస్తూ కొందరు కామెంట్స్ చేయడంతో భయపడ్డామని చెప్పుకొచ్చారు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఆదికేశవ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి. తాజాగా ఆయన ఈ పోలికపై వివరణ ఇచ్చాడు. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ఆదికేశవ. ఎన్నో వాయిదాల అనంతరం ఈ చిత్రం ఈ నెల 24న విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. విడుదల కన్ఫర్మ్ కావడంతో మేకర్స్ ప్రమోషన్స్‌ని మొదలెట్టారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఆదికేశవ సినిమాపై వస్తున్న రూమర్స్‌కి దర్శకుడు బ్రేక్ వేసే ప్రయత్నం చేశాడు.
టీజర్‌లో చూపించిన సన్నివేశాన్ని చూసి.. ఇదేదో ఆచార్య సినిమాలా ఆలయాన్ని సంరక్షించే సినిమా అని అంతా అనుకున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. ఇది అలాంటి సినిమా కాదు. హీరో పేరు రుద్ర కాళేశ్వర్ రెడ్డి. సినిమా టైటిల్, హీరో పేరు ప్రకారం కథలో శివుడి ప్రస్తావన తీసుకువచ్చాను అంతే. ఇది టెంపుల్‌ని సంరక్షించే కథ కాదు. శివుడు కనిపించే అంశాలతో ప్రచారం మొదలు పెట్టాలని.. టీజర్‌ని అలా కట్ చేశాం. అది చూసిన వారిలో కొందరు ఆచార్య సినిమాతో పోలుస్తూ కామెంట్స్ చేయడంతో భయపడ్డాం. మేం అనుకున్నది ఒకటి అయితే.. సినిమా వేరే కోణంలో వెళ్లిందని కంగారు పడ్డాం. అలా అనుమానాలు వ్యక్తం చేసిన అందరికీ చిత్ర ట్రైలర్‌తో సమాధానం ఇవ్వబోతున్నాం. నవంబర్ 17న ట్రైలర్‌ని విడుదల చేస్తున్నామని దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
శ్రీకాంత్ ఎన్ రెడ్డి విషయానికి వస్తే.. సుధీర్ వర్మ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు శ్రీకాంత్. ఆయన దర్శకుడిగా మంచు మనోజ్‌తో అహం బ్రహ్మస్మి అనే సినిమాను ప్రకటించారు కానీ అది కార్యరూపం దాల్చలేదు. కానీ కచ్చితంగా ఆ సినిమా ఉంటుందని ఈ దర్శకుడు అంటున్నారు. టాలీవుడ్ క్రష్ శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఆదికేశవ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. వైష్ణవ్‌కు ఇది నాల్గవ సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.