తెలంగాణ ఎన్నికల్లో యాగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నేతలంతా ఓటర్లను కాదు.. యాగాలను నమ్ముకుంటున్నారు. ఎన్నికల్లో విజయం సాధించాలని కొందరు సర్వశక్తులు ఒడ్డుతుంటే మరికొందరు మాత్రం భారీగా డబ్బు వెచ్చించి మరీ యాగాలు చేస్తున్నారు. నిజానికి ఈ యాగాల పిచ్చి సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉంది అనుకున్నాం ఇప్పటి వరకూ. కానీ ఈసారి ఎన్నికలు వచ్చేసరికి చాలా మంది నేతలు ఆయన బాటను అనుసరిస్తున్నారు. ఓటరు దృష్టిని తమవైపు మరల్చాలని నేతలు పూజలు తలపెట్టారు. కేసీఆర్ 2014, 2018 ఎన్నికల సమయంలో రాజశ్యామల యాగం చేశారు. ఈసారి కూడా ప్రచారానికి వెళ్లడానికి ముందే యాగం చేసి మరీ ప్రచార బరిలోకి దిగారు.
రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలైన ప్రేమ్ సాగర్‌రావు..
ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి అత్యంత ఎక్కువగా నేతలు యాగాలు నిర్వహించారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు రాజశ్యామల యాగం చేశారు. దాదాపు బీఆర్ఎస్ నేతలు ఈ యాగం చేస్తుండగా.. ఒక కాంగ్రెస్ అభ్యర్థి సైతం యాగం నిర్వహించారు. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఇప్పటి వరకూ రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఎలాగైనా గెలవాలని భావించిన ఆయన ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్లను కాదు.. ముందుగా దైవానుగ్రహం ఉండాలని యాగం చేశారు. ఇక చెన్నూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, కేసీఆర్ కుటుంబానికి అత్యంత ఆప్తుడైన బాల్క సుమన్ కూడా రాజశ్యామల యాగం చేశారు.
అమ్మవారి దీక్ష తీసుకుని మరీ యాగం చేసిన ఏలేటి..
నిర్మల్ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సైతం రాజశ్యామల యాగం నిర్వహించిన వారిలో ఉన్నారు. ఆయన 2014లో బీఎస్పీ నుంచి.. 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కానీ ఈసారి మాత్రం ఆయనకు గట్టి పోటీ ఉంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. ఇంద్రకరణ్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ఎలాగైనా విజయం సాధించాలని భావించిన ఆయన నామినేషన్ వేసి వేయగానే రాజశ్యామల యాగం చేశారు. ఇక ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం అమ్మవారి దీక్ష తీసుకుని మరీ యాగం చేశారు. వీరిద్దరిలో అమ్మవారి కరుణా కటాక్షం ఎవరికి ఉంటుందో చూడాలి. ఇక ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ అమ్మవారి దయ కోసం రాజశ్యామల యాగం నిర్వహించారు. ఇక చూడాలి. అమ్మవారు వీరిని ఏమేరకు కరుణిస్తారనేది.