తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినప్పటికీ నేతల మధ్య సమన్వయం లేకపోవడంతోపాటు సీనియర్లు తామే గొప్ప అంటూ ఎవ్వరినీ పార్టీలో ఎదగనివ్వకపోవడం వంటి అంశాలు కాంగ్రెస్ పార్టీకి చేటు తెచ్చి పెట్టాయి. దీంతో తెలంగాణలో కింగ్‌లా ఉండాల్సిన పార్టీ కాస్తా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరింది. అలాంటి పార్టీకి రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌ని చేయడం వంటి అంశాలు బాగా కలిసొచ్చాయి. తరువాత కర్ణాటక ఎన్నికల ఫలితాలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టే స్థాయికి తీసుకొచ్చాయి. ఒక్క కర్ణాటక ఎన్నికల ఫలితాలే తెలంగాణలో కాంగ్రెస్‌కు కావల్సినంత బూస్ట్ ఇవ్వగా.. బీఆర్ఎస్‌ను ఢీకొట్టిన బీజేపీని పాతాళానికి తొక్కేశాయి.
పెరిగిపోయిన విద్యుత్ కోతలు..
ఆసక్తికర విషయం ఏంటంటే.. ఏ కర్ణాటక అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని జాకీలు పెట్టి లేపాయో.. అదే కర్ణాటక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించిందనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బ తీస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. కర్ణాటక ఎన్నికలలో ఇచ్చిన 5 గ్యారెంటీ హామీలను అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేక పోతుండటం దీనికి ఒక కారణమైతే.. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విద్యుత్ కోతలు పెరిగిపోవడం మరో కారణం. దీనిని బీఆర్ఎస్ బూచిగా చూపిస్తూ లబ్ది పొందేందుకు యత్నిస్తోంది. ఇక ఎన్నికల ప్రచారానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డికె శివకుమార్ తెలంగాణకు వచ్చారు. వారు మాట్లాడే మాటలతో కాంగ్రెస్ మరింత ఇబ్బంది పడుతోందని టాక్.
మూడు నెలలకో ముఖ్యమంత్రి..
పైగా కర్ణాటకలో సిద్ధరామయ్య అధికారం చేపట్టి ముచ్చటగా మూడు నెలలైనా కాకముందే ముఖ్యమంత్రి పదవి కూడా సీనియర్స్ పలువరు పైరవీలు ప్రారంభించారు. దీనిని హైలైట్ చేస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతీ మూడు నెలలకి ముఖ్యమంత్రులు మారుతూనే ఉంటారని ఎద్దేవా చేస్తోంది. అసలే ఆది నుంచి టీ కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలంతా పార్టీలో తామంటే తామే ఎక్కువ అంటూ గొడవ చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పతమైందంటేనే కారణం ఇదే. ఇప్పుడేదో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో నేతలంతా ఒక్కటయ్యారు. ఎప్పటికీ ఇలాగే ఉంటారని కూడా చెప్పలేం. మొత్తానికి ఏ కర్ణాటక అయితే టీ కాంగ్రెస్‌ను లేపిందో అదే కర్ణాటక ఇప్పుడు ముంచేలా ఉంది.