ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ మొదటి సెమీ ఫైనల్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ చెలరేగారు. కింగ్ కోహ్లీ సెంచరీతో చరిత్ర సృష్టించగా.. శ్రేయస్ అయ్యర్ వరసగా మరో సెంచరీతో కదంతొక్కాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో భారత్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 397 పరుగులను చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రోహిత్.. ఇన్నింగ్స్‌ని ధాటిగా ప్రారంభించాడు. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మొత్తం 29 బంతులు ఆడిన రోహిత్ 47 పరుగులు చేసి సౌథి బౌలింగ్‌లో క్యాచ్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రన్నింగ్ మెషీన్ కింగ్ కోహ్లీ, గిల్‌తో జతకట్టి చక్కని షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
ఈ క్రమంలో కండరాల పట్టేయడంతో గిల్ 79 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా క్రీజ్ వదిలి బయటికి వచ్చేశాడు. గిల్ బయటికి వెళ్లడంతో క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ ఆయ్యర్ మరోసారి తన ఫామ్‌ని కనబరిచాడు. కోహ్లీ, శ్రేయస్ చూడచక్కని షాట్లతో ప్రేక్షకులని అలరిస్తూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో కోహ్లీ తన 50వ సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. సెంచరీ పూర్తయిన కాసేపటికే కోహ్లీ 117 (113 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అవుటవ్వగా.. శ్రేయస్ దూకుడుగా ఆడి వరుసగా రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 70 బంతులు ఆడిన అయ్యర్.. 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 105 పరుగులు చేసి భారీ షాట్ ఆడే క్రమంలో అవుటయ్యాడు. మరో వైపు కెఎల్ రాహుల్ కూడా క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్స్‌తో స్కోర్‌ని పరుగులు పెట్టించాడు. మొత్తం 20 బంతులు ఆడిన రాహుల్ 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. చివరిలో సూర్యకుమార్ యాదవ్ 2 బంతులు ఆడి 1 పరుగుకి అవుటయ్యాడు.
న్యూజిలాండ్ బౌలింగ్‌లో సౌథి 3 వికెట్లు తీసుకోగా, ట్రెంట్ బౌల్ట్ 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ వరల్డ్ కప్‌లో 50 సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ నెలకొల్పగా.. 50 సెంచరీలతో సచిన్ (49) రికార్డును అధిగమించి కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇక 398 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ జట్టుని ఆదిలోనే షమీ దెబ్బతీశాడు. ఓపెనర్లు కాన్వే (13), రచిన్ రవీంద్ర (13)లను తక్కువ పరుగులకే అవుట్ చేసినప్పటికీ.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విలియమ్సన్, మిచెల్ భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ లక్ష్యం వైపు దూసుకెళుతున్నారు. న్యూజిలాండ్ వికెట్లను తీయడానికి భారత్ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.