క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ భారత్ విజయ దుందుభి మోగించింది. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఎప్పుడో సెమీస్ చేరుకుంది. ఆఖరి లీగ్ మ్యాచ్ నెదర్లాండ్స్‌లో జరుగగా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 410 పరుగుల భారీ లక్ష్యాన్ని నెదర్లాండ్స్ ముందుంచింది. కొండంత లక్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన నెదర్లాండ్స్ జట్టు 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 160 పరుగుల భారీ తేడాతో మరో ఘన విజయాన్ని అందుకుని లీగ్‌లో లేదు పోటీ అని అనిపించుకుంది. ఆడిన 9 మ్యాచుల్లోనూ విజయం సాధించి అజేయంగా సెమిస్ పోరుకు భారత్ సిద్ధమవుతోంది.
బ్యాటింగ్‌లో బీభత్సంగా రాణించిన భారత ఆటగాళ్లు ఫీల్డిండ్, ముఖ్యంగా బౌలింగ్‌లోనూ తమ ప్రతిభను కనబరిచారు. ఇంపార్టెంట్ మ్యాచ్ కాకపోవడంతో కెప్టెన్ రోహిత్ పలు ప్రయోగాలు చేస్తూ.. వీక్షకులను ఆశ్చర్యపరిచాడు. కోహ్లీ, గిల్, సూర్యకుమార్ యాదవ్‌తో బౌలింగ్ చేయించడమే కాకుండా.. తను కూడా బౌలింగ్ చేసి 1 వికెట్ తీసుకున్నాడు. లీగ్‌లోని చివరి ఇన్నింగ్స్ చివరి వికెట్ రోహిత్ శర్మకే దక్కడం విశేషం. 3 ఓవర్లు వేసిన కింగ్ కోహ్లీ కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. భారత్ బౌలింగ్ ప్రయోగాలు చేస్తుంటే.. నెదర్లాండ్స్ జట్టు వికెట్లు పడుతున్నా.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. భారీ లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ పోరాట పటిమను చాటింది. తేజ నిడమానురు (54), ఎంగెల్ (45) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత్ బౌలర్లలో సిరాజ్, బుమ్రా, కుల్‌దీప్, జడేజా రెండేసి వికెట్లు తీసుకోగా.. కోహ్లీ, రోహిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అందరి మన్ననలు పొందిన భారత జట్టు ఇంకో రెండో మ్యాచ్‌లు కనుక ఆడి గెలిస్తే.. చరిత్ర సృష్టిస్తుంది. ఫస్ట్ సెమి ఫైనల్ మ్యాచ్ భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 15న జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. భారత్ ఫైనల్‌కి చేరుకుంటుంది. ఫైనల్‌లో సౌతాఫ్రికా లేదంటే ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ప్రపంచకప్‌లో అపజయం అనేది లేకుండా దూసుకుపోయిన భారత్ జట్టు.. ఈ రెండు మ్యాచ్‌లను నెగ్గి.. చరిత్ర సృష్టించాలని భారత క్రికెట్ అభిమానులందరూ ఎంతగానో కోరుకుంటున్నారు. రోహిత్ సేనకు ఆల్ ద బెస్ట్...