ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు సమావేశమై ఏపీ సీఎం జగన్‌ను ఎదుర్కోవడమెలా? ఉమ్మడి శత్రువును దెబ్బ తీయడమెలా? అనే అంశాలపై చర్చించడం జరిగింది. ఇకపై జగన్, వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు సమాయత్తమయ్యాయి. మరి వీరితో బీజేపీ కలిసొస్తుందా? రాదా? అనేది మాత్రం తెలియరాలేదు. తాజాగా అమరావతిలో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికల మేనిఫెస్టో మొదలు అన్ని విషయాలపై చర్చించడం జరిగింది. ఈ క్రమంలోనే త్వరలో జిల్లాల వారిగా ఉమ్మడి సభలు పెట్టాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి.
కోర్టులో బెయిల్ వస్తే ఏంటి?
తొలుత టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌పై క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇది రాగానే.. ఏపీ మొత్తం సభలు, సమావేశాలు నిర్వహించాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. కోర్టులో బెయిల్ వస్తే ఏంటి? రాకపోతే కార్యాచరణను ఎలా రూపొందించుకోవాలనే విషయమై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ బెయిల్ వస్తే మాత్రం జరగనున్న సభలో చంద్రబాబు, పవన్ కలిసి పాల్గొంటారు. ఇక ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించాలని గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండాలన్నదానిపై రెండు పార్టీల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. దీనికోసం ఈ నెల 13న ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.
బీసీలపై ఫోకస్..
మొత్తానికి టీడీపీ, జనసేన రంగంలోకి అయితే దిగాయి. ఒక్క చంద్రబాబు కేసు ఏదో ఒకటి తేలితే చాలు.. ఆయన కూడా రాజకీయాలపై ఫోకస్ పెడతారు. ఇక టీడీపీ, జనసేనలు ముఖ్యంగా యువత, నిరుద్యోగ సమస్యలపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు. అలాగే బీసీలు, వారి సమస్యలు, వారిపై జరుగుతున్న దాడులను హైలైట్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే వైసీపీ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అడ్డదారిలో గెలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వలంటీర్ల ద్వారా ఓట్ల తొలగింపు కార్యక్రమం చేపడుతున్నారు. కేసుల పేరుతో ఇతర పార్టీల నేతలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వార్డుల వారీగా విపక్షాలు ఎవరినైతే పోలింగ్ ఏజెంట్‌గా నియమించే అవకాశం ఉందో వారందరిపై పోలీసు వ్యవస్థను వాడుకుని ఏవో ఒక కేసులు పెడుతున్నారు.