ప్రస్తుతం తెలంగాణాలో ఎన్నికల వేడి మాములుగా లేదు. ఒకపక్క నామినేషన్స్ ప్రక్రియ మరోపక్క ఎన్నికల ప్రచారం అంటూ BRS, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు హడావిడి చేస్తున్నాయి. సీఎం కేసీర్ రోజుకు నాలుగైదు సభల్లో ప్రసంగిస్తూ ఆయా అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోపక్క కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి, మిగతా నాయకులూ రోడ్ షోలతో హడావిడి చేస్తున్నారు. ఇక బీజేపీ కైతే ఢిల్లీ నాయకులతో పాటుగా ప్రధాని మోడీ వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన BRS నామినేషన్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది.జీవన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మంత్రి KTR హాజరయ్యారు. BRS శ్రేణులు ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయల్దేరారు. KTR సహా ఇతర నేతలు ప్రచార వాహనంపై వెళ్లారు. ఈ క్రమంలో వాహన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో KTR, ఎంపీ సురేశ్‌రెడ్డి, BRS అభ్యర్థి జీవన్‌రెడ్డి కిందపడిపోయారు. సడన్ బ్రేక్‌తో వాహన రెయిలింగ్ ఊడిపోవడంతో వారంతా కిందపడ్డారు. కిందపడడంతో KTRకు స్వల్ప గాయాలయ్యాయి. ఆర్మూర్ పట్టణంలోని పాత ఆలూర్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరికీ ఏం కాకపోవడంతో జీవన్‌రెడ్డితో పాటు KTR నామినేషన్ కేంద్రానికి వెళ్లారు.
ఈ కార్యక్రమం అనంతరం KTR కొడంగల్ లో రోడ్ షోలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. జీవన్ రెడ్డి, సురేష్ రెడ్డి, మిగతా వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఎంపీ సురేష్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా పెద్ద ప్రమాదం తప్పింది, దేవుడి దయ వలన ఎవరికీ ఏమి కాలేదు, వాహనానికి సడన్ బ్రేక్ వెయ్యడంతో జారిపోయి రైలింగ్ ని పట్టుకున్నాము, అందరూ క్షేమమే అంటూ ట్వీట్ చేసారు. తనకేమి కాలేదని, తాను క్షేమంగానే ఉన్నాను అని, తన ఆరోగ్య పరిస్థితి పైన ఎలాంటి ఆందోళన చెందవద్దని కేటీఆర్ తెలిపారు.