తెలంగాణలో తొలిసారిగా ఎన్నికల బరిలో నిలవాలని జనసేన నిర్ణయం తీసుకుంది. తొలుత జనసేన కూడా టీడీపీ మాదిరిగా తెలంగాణలో పోటీ చేయదని అంతా భావించారు కానీ కార్యకర్తల అభిప్రాయంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో భేటీ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించారు. ఇక కిషన్ రెడ్డితో భేటీల పొత్తుతో పాటు సీట్ల విషయమై కూడా చర్చ జరిగింది. తొలుత తమకు బలముందని భావించిన 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. బీజేపీతో భేటీ అనంతరం 8 స్థానాలకే జనసేన పరిమితమైంది. మరో రెండు స్థానాల విషయమై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.
పూర్తి స్థాయిలో బీజేపీ ఫోకస్..
ఇక ఇప్పటికైతే జనసే పోలీ చేసే స్థానాలు వచ్చేసి ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వరావుపేట, కోదాడ, నాగర్ కర్నూల్, మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లి స్థానాల నుంచి జనసేన బరిలోకి దిగనుంది. ఇక పొత్తు ఫిక్స్. నెక్ట్స్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఈ సారి తెలంగాణ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అగ్ర నేతలంతా వరుసబెట్టి తెలంగాణకు రానున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. అదే రోజున బీజేపీ బీసీల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ సభలో మోదీతో పాటు జనసేన అధినేత వపన్ కల్యాణ్ సైతం పాల్గొననున్నారు.
టీడీపీ సపోర్ట్ కూడా బీజేపీకేనా?
చాలా కాలం తర్వాత మోదీతో కలిసి పవన్ వేదికను పంచుకోబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏపీలో టీడీపీతో పొత్తు ప్రకటించిన తరువాత మోదీ, పవన్ కలిసింది లేదు. వీరిద్దరి మధ్య ఎలాంటి భేటీ జరగలేదు. వీరి పొత్తు అనేది తెలంగాణకేనా? లేదంటే ఏపీకి కూడా పరిమితమవుతుందా? అనేది కూడా తెలియలేదు. ఈ సభ అనంతరం మోదీ, పవన్‌ల మధ్య ఏపీ విషయమై కూడా చర్చ జరుగుతుందా? అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మొత్తానికి ఏపీలో కూడా ఈ సయోధ్య కొనసాగుతుందని టాక్. తెలంగాణలో టీడీపీ సపోర్ట్ కూడా బీజేపీకే ఉంటుందని కొందరు అంటున్నారు. కొద్ది రోజుల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను స్వయంగా కిషన్ రెడ్డే వెంటబెట్టుకుని మరీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా దగ్గరకు తీసుకెళ్లారు. తెలంగాణలో టీడీపీ సపోర్ట్ కోసమే కిషన్ రెడ్డి అలా చేశారంటూ అప్పట్లో టాక్ నడిచింది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..