సామాన్యులకు ఏదైనా పని కావాలంటే ప్రజాప్రతినిధులు ముప్పు తిప్పలు పెట్టించి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు. ఇక ఎన్నికల సమయం వచ్చేసరికి సీన్ రివర్స్. నేతలనే జనం ముప్పు తిప్పలు పెట్టిస్తారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉంది. కానీ రాజకీయ వేడి మాత్రం ఇప్పటికే ఊపందుకుంది. పార్టీలన్నీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఏ పనైనా చేస్తున్నారు. తాను అరెస్ట్ అయ్యేంత వరకూ టీడీపీ అధినేత చంద్రబాబు పలు కార్యక్రమాలతో జనం మధ్యే ఉన్నారు. ఆయన తనయుడు నారా లోకేష్ సైతం యువగళం పరుతో జనం మధ్యే ఉన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర.. ఇక వైసీపీ కూడా ఏడాదిన్నర ముందు నుంచే గడప గడపకు తదితర కార్యక్రమాలతో జనంలో ఉంటోంది.
జనస్పందనతో లెక్కలు మారుతున్నాయ్..
అంతా ఓకే కానీ జనం ఏ పార్టీ వెంట ఉన్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఎవరు ఏ సభ పెట్టినా కూడా తండోపతండాలుగా వస్తున్నారు. మరి వారంతా ఓటేస్తారా? అంటే జరగని పని. వారు ఎన్ని పార్టీలకు వేస్తారు? నిజానికి పెద్ద ఎత్తున వస్తున్న జనాన్ని చూసి పార్టీలన్నీ సంబరపడుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీల అధినేతలంతా రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. విజయావకాశాలను అంచనా వేసుకుంటున్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యాక వచ్చిన జనస్పందనతో ఆ పార్టీ లెక్కలు బీభత్సంగా ఉన్నాయి. వైసీపీ కూడా సామాజిక సాధికారత బస్సు యాత్రలకు వస్తున్న జనాన్ని చూసి ఓ రేంజ్‌లో లెక్కలు వేస్తోంది. జనసేన కూడా తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఈసారి తమ పార్టీ బీభత్సంగా పుంజుకుందని భావిస్తోంది.
పార్టీలు కన్ఫ్యూజ్ అవుతున్నాయట..
జనం ఇలా పెద్ద ఎత్తున పార్టీల సభలకు రావడాన్ని కేవలం వాపుగా మాత్రమే చూడాలి. బలుపు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. మొత్తానికి జనం అయితే మూడు పార్టీలనూ ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారు. నిజానికి ఏదైనా పార్టీ సభకు అభిమానంతో వచ్చేది కొందరు మాత్రమే. మిగిలిన వారంతా ఎక్కువ మంది మందు, బిర్యానీ ప్యాకెట్ కోసం వచ్చేవారేనని టాక్. దీంతో జనం ఏ పార్టీకి మద్దతుగా ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీలు సైతం జనం నాడిని పట్టుకోలేక పార్టీలు కన్ఫ్యూజ్ అవుతున్నాయని సమాచారం. అసలు క్షేత్ర స్థాయిలో ఏ పార్టీ బలమెంత? అనేది తెలియడం లేదట. ఈ క్రమంలోనే ఒకటికి రెండు సార్లు సర్వేలు చేయించుకుంటున్నాయట పార్టీలు. మొత్తానికి జనం అయితే పార్టీలన్నింటికీ చుక్కలు చూపిస్తున్నారు. చివరకు ఏ పార్టీకి ఓటేస్తారనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు.