ఈరోజు శనివారం జనసేన నేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును పరామర్శించారు. నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్టోబరు 31న రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన చంద్రబాబు వైద్య పరీక్షల కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చారు.
శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్యులు అన్ని రకాల రక్త పరీక్షలతో పాటు గుండె, ఊపిరితిత్తులు, చర్మ అలర్జీకి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. జైలు నుంచి విడుదలైన చంద్రబాబు ని వ్యక్తిగతంగా కలిసి ఆయన ఆరోగ్య విషయాలను తెలుసుకునేందుకు పవన్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. రెండ్రోజుల్లో చంద్రబాబు ఎల్వీపీఈఐలో నేత్ర పరీక్షలతో పాటు సర్జరీ చేయించుకుంటారని సమాచారం.