మొన్నటి వరకూ ఐటీ రైడ్స్ బీఆర్ఎస్ నేతలను ఒక ఆట ఆడుకున్నాయి. ఎప్పుడు ఎవరింటిపై రైడ్ జరుగుతుందో తెలియక బీఆర్ఎస్ నేతలు బెంబేలెత్తిపోయారు. నిజానికి బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో అక్కడి అధికార పార్టీని టార్గెట్ చేస్తూ రైడ్స్ జరుగుతుంటాయని ఎప్పటి నుంచో నడుస్తున్న టాక్. కానీ ఇప్పుడు తెలంగాణలో సీన్ రివర్స్. కాంగ్రెస్ పార్టీలక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన మహేశ్వరం అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి మీద ఐటీ శాఖ దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లపై సోదాలు జరుగుతుండటంపై మాటల యుద్ధం నడుస్తోంది.
బీఆర్‌ఎస్ పార్టీకి సవాల్ విసురుతున్న కాంగ్రెస్..
అసలే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాంచి జోరు మీదుంది. పార్టీలోకి వలసలు సైతం బీభత్సంగా సాగుతుండటం ఆ పార్టీకి మరింత బూస్ట్ ఇస్తోంది. దీంతో ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీకే సవాల్ విసురుతోంది. ఇక మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం రంగంలోకి దిగి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డితో పాటు కొందరు కాంగ్రెస్ నేతల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అటు బడంగ్‌పేట మేయర్ పారిజాత ఇంట్లోనూ ఐటీ సోదాలు జరిగాయి. మరోవైపు వేలంలో బాలాపూర్ లడ్డూని దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి ఇంటినీ వదలకుండా ఐటీ సోదాలు నిర్వహించింది.
కవితను వదిలేసి మాపై రైడ్సా?
ఓడిపోతారనే భయంతోనే తమ పార్టీ నేతల ఇళ్లపై బీజేపీతో కలిసి ఐటీ దాడులు చేయిస్తోందని పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటున్న కాంగ్రెస్ నేతలకు ఇది మంచి అస్త్రంగా మారింది. రెండు పార్టీలూ కుమ్మక్కై ఇలా రైడ్స్ చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈడీ కేసులో ఉన్న కవితను వదిలేసి తమపై రైడ్స్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లపై సోదాలు జరగడంపై జనంలోనూ చర్చ జరుగుతోంది. అయితే ఈ ఐటీ రైడ్స్‌పై స్పందించిన కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అసలు దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదంటున్నారు.