ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. చాలా మంది కీలక నేతలు పార్టీ మారాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఇంకా నేతలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని టాక్. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అగ్ర నేతలంతా బీఆర్ఎస్‌కు షాక్ ఇస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే పార్టీ మారారు. మరికొందరు నేతలు సైతం పార్టీ మారారు. ఇక తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు.
వనమాపై పోటీ చేసి ఓటమి..
త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌కు చెందిన జలగం కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనలేదు. ఇప్పుడు పార్టీ మారబోతున్నట్టు టాక్ నడుస్తోంది. 2004లో సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన జలగం.. 2014లో తిరిగి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2018లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత వనమా బీఆర్ఎస్‌లో చేరారు. అయితే ఈసారి కూడా జలగం బీఆర్ఎస్ టికెట్ దక్కుతుందని ఆయన భావించారు కానీ ఆ పార్టీ హ్యాండ్ ఇచ్చింది.
హాట్ టాపిక్ ఏంటంటే..
వనమాకు టికెట్ కేటాయించినప్పటి నుంచి జలగం అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పుడు పార్టీ మారాలనే యోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. అయితే ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే.. జలగం వెంకట్రావు కూడా పార్టీ మారితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని టాక్. ఇప్పటికే పార్టీని వీడిన నేతలంతా బీఆర్ఎస్‌ను ఓడించేందుకు శతవిధాలుగా యత్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం భారీ పోటీ ఉంది. జలగం చేరికతో ఇప్పుడు కాంగ్రెస్ కొత్త సవాల్ ఎదురైంది. దీన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి.