ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ చేస్తున్నది కక్ష సాధింపా? లేదంటే చంద్రబాబుకు భయపడుతున్నారా? వరుసగా కేసుల మీద కేసులు ఎందుకు పెడుతున్నారు. ప్రతీ సభలోనూ పనిగట్టుకుని మరీ ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? వీలైనంత ఎక్కువ కాలం జైల్లోనే చంద్రబాబును ఉంచాలని ఎందుకు ఆరాటపడుతున్నారు? మరి నాలుగేళ్ల పాటు ఏం చేశారు? ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉండగానే ఎందుకిలా? అసలు ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సీఐడీ చేత హైకోర్టులో అపిడవిటా? అసలు జగన్ ఎందుకిలా చేస్తున్నారు? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవద్దట..
చంద్రబాబుకు నెల రోజుల పాటు తాత్కాలిక బెయిల్ లభించింది. దీంతో జగన్ భయపడిపోయినట్టున్నారు. చంద్రబాబు ఎక్కడ పెదవి విప్పితే ఇబ్బందవుతుందోనని ఆఘమేఘాల మీద సీఐడీ చేత హైకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేయించింది. అనారోగ్య కారణాలతో విడుదలవుతున్నా కూడా చంద్రబాబుకు హైకోర్టు చేత షరతులు విధింపజేసేలా ప్లాన్ చేసింది. చంద్రబాబు పార్టీ అధినేతగా వ్యవహరించకూడదు. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవద్దంటూ షరతులు విధించేలా హైకోర్టును కోరింది. కానీ ఇవన్నీ ఎందుకు? ఒకప్పుడు జగన్ కూడా జైలులోనే ఉన్నారు. బయటకు వచ్చి సీఎం అయ్యారు. ఆయనకు లేని షరతులు చంద్రబాబుకు ఎందుకు?
ఇది జగన్ నీతి..
అసలు చంద్రబాబును మాట్లాడనివ్వకుండా చేయాలని జగన్ ఎందుకంతలా ప్రయత్నిస్తున్నారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో చంద్రబాబు కూడా అలాగే చేసుంటే జగన్ సీఎం అయ్యేవారా? బయటకు వచ్చాక సాక్ష్యులను ప్రలోభపెట్టి వారికి పెద్ద మొత్తంలో లాభం చేకూర్చి వారి నోళ్లు మూయించారు. ఇది జగన్ నీతి. మరి చంద్రబాబు ఏమీ మాట్లాడొద్దంటే వైసీపీ నేతలు కూడా ఆయనపై ఆరోపణలు చేయకూడదు కదా? వారు మాత్రం నోటికొచ్చిన ఆరోపణలన్నీ చేయవచ్చా? ఆయన జీవితకాలం బయటకు రారంటూ బహిరంగ వేదికల్లో చెబుతున్నారు. కనీసం తొమ్మిదేళ్లయినా జైలులో మగ్గాల్సిందేనంటున్నారు. ఎందుకింత పగ? ఇదంతా జనానికి అర్థం కాదనే అనుకుంటున్నారా? ఇక చూడాలి ఏం జరగనుందో.