నారా చంద్రబాబు నాయుడు జైలుకెళ్లి 50 రోజులు దాటిపోయింది. 50 రోజులుగా స్కిల్ డెవెలెప్మెంట్ కేసులో చంద్రబాబు జైల్లో ఉండడంతో.. ఆయన్ని కలిసేందుకు కుటుంభ సభ్యులు రాజమండ్రి జైలుకి వెళ్లేవారు. మొదట్లో బాలయ్య ఎక్కువగా బావగారిని కలిసేందుకు అక్క భువనేశ్వరి, కూతురు బ్రాహ్మణి, అల్లుడు లోకేష్ తో కలిసి వెళ్లినా బాలయ్య తర్వాత లోకేష్, పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు దగ్గరకి వెళ్లారు. ఆ తర్వాత ఆయన ప్రొఫెషనల్ గా బిజీ అయ్యారు.
అసెంబ్లీ సమావేశాల్లోనూ చంద్రబాబు అరెస్ట్ పై బాలయ్య నానా హంగామా చేసారు. అప్పటినుంచి అక్క ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉన్న బాలకృష్ణ ఈరోజు చంద్రబాబు కి బెయిల్ రావడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకి వెళ్లారు. నాలుగు గంటలకి బావగారు చంద్రబాబు విడుదలై జైలు నుంచి బయటికి రాగానే బాలయ్య ప్రేమతో బావగారికి పాదాభివందనం చేసారు. బాలకృష్ణ బావగారు బయటికి రావడంతో ఎంతో హుషారుగా కనిపించారు. కూతురు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్, అక్క భువనేశ్వరి, ఇంకా టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబుకి ఆయన స్వాగతం పలికారు.
బాలకృష్ణ బావగారు చంద్రబాబు వెన్నంటే ఉంటూ ఆయనతో పాటుగా రాజమండ్రి నుంచి అమరావతికి బయలుదేరారు. ప్రస్తుతం, బాలకృష్ణ తన బావగారి కాళ్ళకి మొక్కిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.