అవును.. వందకు వెయ్యి శాతం తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ పార్టీనే..! రెడీగా ఉండండి.. ఆరు గ్యారెంటీ స్కీముల మీదే మొదటి సంతకం.. అటు ప్రమాణ స్వీకారం ఇటు సంతకం రెండూ ఒకేసారి కాబోతున్నాయి.. ఇవీ పార్టీ నేతలు పదే పదే బల్లగుద్ది మరీ చెబుతున్న మాటలు. అంతేకాదు.. చాలా వరకు సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో ఇక అధికారంలోకి వచ్చేశామన్న ఫీలింగ్‌లో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలంగాణకు విచ్చేశారు. ఆయనొస్తే దానికో లెక్క ఉంటుంది.. అధికార పార్టీ వ్యూహాలకు చెక్ పెడతారని అందరూ ఎన్నెన్నో కలలు కన్నారు. సీన్ కట్ చేస్తే.. డీకే రానే వచ్చారు కానీ ఆయన చేసిన ఒకే ఒక్క కామెంట్‌తో పార్టీ ఇజ్జత్ తీసేశారు. దీంతో ఆయన మాటలే అధికార బీఆర్ఎస్‌కు అస్త్రాలుగా మారాయి. ఇక కాంగ్రెస్ పరిస్థితి అంటారా.. పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. ఎవరైతే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు దోహదపడుతారని ప్రచారానికి ఆహ్వానించారో.. వారే పార్టీ పుట్టి ముంచే వ్యాఖ్యలు చేయడంతో ఇదేం ఖర్మరా బాబోయ్ అని పార్టీ పెద్దలు లబోదిబోమంటున్నారు.
అక్కడ సరే.. ఇక్కడ వేరబ్బా..
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకే ఒక్కడు డీకే శివకుమార్ మాత్రమే. ఇక హామీలు కూడా ఈ విజయానికి బాగానే దోహదపడ్డాయి. ఇక్కడ జెండా పాతేసరికి కాంగ్రెస్ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే.. ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారిపోకుండా ఈసారి అధికారంలోకి వచ్చేయాల్సిందేనని గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేతలంతా రాష్ట్రంలోనే తిష్ట వేశారు. ఈ క్రమంలోనే స్టార్ క్యాంపెయినర్ డీకే రాష్ట్రానికి విచ్చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ విషయంలో పప్పులో కాలేశారు. చాలా రోజులుగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పవర్ పాలిటిక్స్ నడుస్తుండగా ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తూ.. కర్ణాటకలో మా ప్రభుత్వం వ్యవసాయానికి 5 గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తోందని ప్రకటించారు. ఫైవ్ అవర్స్.. ఫైవ్ అవర్స్ అంటూ ఇంగ్లీషులో అరిచి అరిచి చెప్పారు. దీంతో అప్పటివరకూ డీకే కామెంట్స్‌ను తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ మాటలను చెప్పడానికి సాహసించలేదు. తాండూరులో వేదికగా విజయభేరి కార్నర్ మీటింగ్‌లో ఇదంతా జరిగింది. అంతటితో ఆగని ఆయన.. తీవ్ర సంక్షోభంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో రైతులకు 5 గంటల విద్యుత్ ఇస్తోందని.. దానిని 7 గంటలకు పెంచే ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం 24 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారంటూ ఆరోపించారు. ఓ వైపు బీఆర్ఎస్.. మరోవైపు కాంగ్రెస్ రెండు పార్టీలు 24 గంటలు కరెంట్ ఇస్తామని హామీ ఇస్తూ వచ్చాయి. ఇప్పుడు సడన్‌గా డీకే ఇలా 5 గంటలు అని చెప్పడంతో కక్క లేక మింగలేక అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి తయారయ్యింది.
సువర్ణావకాశం..
డీకే రావడంతో కాంగ్రెస్‌కు ఏ మాత్రం ప్లస్ అవుతుందో దేవుడెరుగు కానీ.. బీఆర్ఎస్‌కు సువర్ణావకాశాన్ని అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా డీకే కామెంట్స్‌నే బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు ఓ రేంజ్‌లో వైరల్ చేస్తున్నారు. చూశారుగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదని బీఆర్ఎస్ నేతలు తెగ చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేవలం 3 గంటలు మాత్రమే ఇస్తామని ఓసారి.. ఇప్పుడేమో 5 గంటలకు ఇస్తామని డీకే ప్రకటన చేయడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా అయ్యింది. మొత్తానికి చూస్తే.. డీకే ఎంతసేపూ పార్టీని లేపుతారనుకుంటే.. ఉన్న పార్టీని పడుకోబెడుతున్నారనే కామెంట్స్ సొంత పార్టీల నేతల్లోనే మొదలయ్యాయి. శివకుమార్ మాటల ప్రభావం ఎంతవరకు ఉంటుంది.. కలిసొస్తుందనుకున్న కాంగ్రెస్ అసలు కొంప మునిగిందా..? అనేది తెలియాలంటే డిసెంబర్-03 వరకు వేచి చూడాల్సిందే మరి.