తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎన్నికల వేళ నానాటికీ దారుణంగా తయారైంది. పార్టీలో ఎవరుంటారో.. ఎవరు వీడుతారో కూడా తెలియడం లేదు. టీపీసీసీ చీఫ్‌గా బండి సంజయ్‌ను తొలగించి కిషన్ రెడ్డిని నియమించిన తరువాత పరిస్థితి మరింత విషమించింది. పోనీ పరిస్థితులను సరిదిద్దేలా కిషన్ రెడ్డి ఏమైనా చేస్తున్నారా? అంటే అదీ లేదు. పోతీ పోనీ.. ఉంటే ఉండనీ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని పార్టీ కేడర్‌లో చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి తన బాధ్యతలను ఏమాత్రం నిర్వర్తించలేదని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.
పార్టీ మారుతున్నారని తెలిసినా..
అసలు కిషన్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టాకే అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం ఒక ఎత్తైతే.. ఫలానా వ్యక్తి ఆయన కీలక నేత అయినా సరే.. పార్టీ మారుతున్నారని తెలిసినా కూడా కనీసం బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా బుజ్జగించే యత్నం కూడా చేయలేదు. నిజానికి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడం కిషన్‌రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదని టాక్. అందుకే ఆయనసలు పార్టీలో జరుగుతున్న పరిణామాలను పట్టించుకోవడం లేదని అంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారని తెలిసినా కూడా పట్టించుకోలేదు. అలాగే చాలా మంది సీనియర్లు పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. వారంతా కూడా పార్టీ మారే అవకాశం లేదని తెలిసినా కూడా వాళ్లను కూల్ చేసే ప్రయత్నం చేయలేదు.
చిన్నాచితకా నేతలైతే ఓకే..
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గం టికెట్ కేటాయించినా కూడా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పార్టీ మారేందుకు యత్నిస్తున్నారు. అలాగే మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కూడా టికెట్ విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో పార్టీ మారేందుకు యత్నిస్తున్నారని టాక్. మరోవైపు జితేందర్‌రెడ్డి లోక్‌సభకు వెళ్లాలనుకుంటే అసెంబ్లీకి పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం చెబుతోంది. వీరి బాటలోనే మరికొందరు నేతలు ఉన్నారు. చిన్నా చితకా నేతలైతే పార్టీ మారినా లైట్ తీసుకోవచ్చు కానీ ఇలా కీలక నేతలు పార్టీ మారుతున్నా కూడా చూస్తూ కూర్చోవడం.. అధ్యక్షుడి హోదాలో ఏ చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ పరిస్థితులను అసలు సరిదిద్దేదెవరని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.