తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో పుంజుకుందనడంలో సందేహం లేదు. ఒకప్పుడు రాష్ట్రాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏలిన పార్టీ మాత్రమే కాకుండా తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెసే కావడం గమనార్హం. నేతల మధ్య సమన్వయ లోపం.. సీనియర్ల మధ్య కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకోవడం వంటి కారణాలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీభత్సంగా దెబ్బతిన్నది. దాదాపు మూడో స్థానానికి పడిపోయింది. దశాబ్ద కాలం తర్వాత బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతతో పాటు బీజేపీకి ఆదరణ కరువవడం కాంగ్రెస్‌కు కలిసొచ్చాయి. అలాగే రాష్ట్ర సారధ్యం మారడం కూడా పార్టీకి ప్లస్ అయ్యింది. మొత్తానికి మూడో స్థానానికి పడిపోయిన పార్టీ..తిరిగి కెరటంలా లేచి అధికార పార్టీకి సవాల్ విసిరే స్థాయికి చేరింది.
విపరీతంగా పెరిగిన క్రేజ్..
ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం రంగంలోకి దిగారు. రాష్ట్రంలో పార్టీ ప్రచార బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నడుం బిగించారు. అయితే రాహుల్ తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకు రాగలరా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. నిజానికి గతంలో అయితే అది అసాధ్యమనే చెప్పాలి. కానీ రాహుల్‌కు ఇటీవలి కాలంలో క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఆయన తన పాదయాత్రతో జనాకర్షక నేతగా మారారు. ఈ క్రమంలోనే తెలంగాణలో రెండో సారి నవంబర్ 1 నుంచి వారం రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ అయితే బలహీనంగా ఉందో ఆయా ప్రాంతాల్లో రాహుల్ పర్యటించనున్నట్టు తెలుస్తోంది.
వ్యూహాత్మకంగా ముందుకెళుతున్న కాంగ్రెస్..
ఇప్పటికే రాహుల్ తెలంగాణలో మూడు రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించారు. రాహుల్ బస్సు యాత్రకు వచ్చిన స్పందన చూసి ఆ పార్టీ నేతలే షాక్ అయ్యారు. నవంబర్ 1 నుంచి వారం రోజుల పాటు రాహుల్ బస్సు యాత్రలో పాల్గొననున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సైతం మరోమారు రాహుల్‌తో పాటు యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ యాత్ర కాంగ్రెస్ పార్టీకి తప్పక మేలు చేస్తుందని అంతా భావిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఈసారి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. కాంగ్రెస్ అడుగులను గమనిస్తున్న గులాబీ బాస్ సైతం అలర్ట్ అవుతున్నారు. ఈసారి ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని శతవిధాలా యత్నిస్తున్నారు.